కల్కితో టాలీవుడ్ క్యాలెండర్ ఫస్ట్ హాఫ్ అయిపోతుంది. కల్కి ఫలితం ఎలా వుంటుందో కానీ ఇప్పటివరకూ వెనక్కి తిరిగి చూసుకుంటే.. హనుమాన్, డీజే టిల్లు 2 తప్పితే యునానిమస్ గా హిట్ అనిపించి బాక్సాఫీసు వద్ద కలెక్షన్స్ కురిపించిన సినిమా మరొకటి లేకపోవడం ఖచ్చితంగా పరిశ్రమకు లోటే.
ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ సెకండ్ హాఫ్ పైనే వున్నాయి. సెకండ్ హాఫ్ లో వచ్చే సినిమాల లైనప్ క్రేజీగానే వుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాని, రామ్, రవితేజ, నాగ చైతన్య, నితిన్, గోపీచంద్ ఇలా వరుసగా ప్రేక్షకులుని అలరించడానికి సిద్ధంగా వున్నారు.
ఆగస్ట్ లో రామ్ డబుల్ ఇస్మార్ట్ తో వస్తున్నాడు. నిజానికి ఈ డేట్ కి అల్లు అర్జున్ పుష్ప తో రావాల్సింది. కానీ వాయిదా పడటంతో ఆ డేట్ కి రామ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆగస్ట్ లోనే నాని సరిపోదా శనివారం సినిమా కూడా వుంది. సెప్టెంబర్ లో ఎన్టీఆర్ దేవర సందడి మొదలైపోతుంది. అదే వారంలో దుల్కర్ సల్మాన్ తెలుగు లో చేసిన లక్కీ బాస్కర్ వస్తోంది. డిసెంబర్ 6న పుష్ప 2 రూలింగ్ వుంటుంది.
ఇది కాకుండా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, రవితేజ మిస్టర్ బచ్చన్, గోపీచంద్ విశ్వం, విష్ణు కన్నప్ప, నాగార్జున ధనుష్ కుబేర, నరేష్ బచ్చల మల్లి, బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు, నిఖిల్ స్వయంభూ, నాగచైతన్య తండెల్ సినిమాలు కూడా ఇదే ఏడాది సెకండ్ హాఫ్ లో రానున్నాయి. త్వరలోనే అఫీషియల్ డేట్స్ ఇస్తారు.
ఇందులో దేవర, గేమ్ ఛేంజర్, పుష్ప 2 లాంటి భారీ స్కేల్ ఎంటర్ టైనర్స్ పై ప్రేక్షకులే కాదు పరిశ్రమ చాలా అంచనాలు పెట్టుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఈ సినిమాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో అనే ఆసక్తి అందరిలో వుంది.