టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశ అయిపొయింది. ఇప్పుడు టోర్నీ సూపర్ 8లోకి అడుగుపెట్టింది. గ్రూప్ దశలో ఇండియా వందశాతం విజయాలతో ముందుకు కదిలింది. అయితే ఇప్పుడు సూపర్ 8 అంత ఈజీ కాదు. సూపర్ 8 గ్రూప్ 1 లో అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండియా జట్లు వున్నాయి. ఇందులో ప్రతి జట్టు బలమైనదే. ఏ జట్టుతో విజయం నల్లేరు మీద నడక కాదు. ఆస్ట్రేలియా గురించి అందరికీ తెలుసు. ఇండియాని పలు సందర్భాల్లో ఓడించిన ట్రాక్ రికార్డ్ బంగ్లాదేశ్ కి వుంది. పైగా ఈ టోర్నీలో బంగ్లా జట్టు పటిష్టంగా వుంది. కీలక మ్యాచుల్లో ఎవరో ఒక ప్లేయర్ జట్టుని ఆదుకుంటున్నారు.
ఇక అఫ్గానిస్తాన్ జట్టు సంచలన విజయాలకు పెట్టింది పేరు. ఆ జట్టు ఎప్పుడు ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో, ఎంత బలమైన జట్టుని ఓడిస్తుందో అంచనా వేయలేం. ఈ టోర్నీలోనే బలమైన న్యూజీలాండ్ జట్టుని ఏకంగా 84 పరుగులతో మట్టికరిపించి గ్రూప్ దశలోనే కివీస్ ని ఇంటికి పంపిచేసింది. అఫ్గానిస్తాన్ లో స్టార్ ఆటగాళ్ళు వున్నారు. ఇందులో చాలా మంది ఐపీఎల్ లో కూడా అదరగొట్టారు. టైటిల్ గెలిచిన కలకత్తా టీంలో గుర్బాజ్ లాంటి ఆటగాడు కీలక పాత్ర పోషించాడు. తన స్పిన్ మాయాజాలంతో మ్యాచ్ ని తిప్పేసే సత్తా రసిద్ ఖాన్ కి వుంది. మిగతా ఆటగాళ్ళు కూడా అన్ ప్రెడిక్టబుల్. ప్రత్యర్ధి జట్టు ఏ మాత్రం ఏమరపాటుగా ఆడినా పై చేయి సాధించేస్తారు.
పైగా ఈ టోర్నీ ఇప్పుడు వెస్ట్ ఇండీస్ కి షిఫ్ట్ అయ్యింది. ఇప్పటివరకూ యూఎస్ లో ఆడింది ఇండియా. కానీ అఫ్గానిస్తాన్ ఇప్పటికే విండీస్ వాతావరణంకు అలవాటైయింది. ఇండియాకి విండీస్ టూర్ కొత్తకాదు. కానీ ఆ దేశంలో ఇండియా జట్టు ఆడి చాలా కాలమైయింది. పైగా యుఎస్ లో భీవత్సమైన పిచ్ లు రెడీ చేశారు. ఇవి బ్యాట్స్ మెన్స్ కి చుక్కలు చూపించాయి. ఇప్పుడు మళ్ళీ మామూలు పిచ్ పై ఆడాలి. ఈ రోజు జరగబోయే బ్రిడ్జ్ టౌన్ పిచ్ సమతూకంలో వుంటుంది. నిలకడగా ఆట ఆరంభిస్తే పెద్ద స్కోర్ చేసే వెసులుబాటు వుంటుంది. అఫ్గానిస్తాన్ నే కాదు ఈ సూపర్ 8లో వున్న ప్రతి జట్టు ప్రమాదకరమే. బ్యాటింగ్ బౌలింగ్.. రెండిట్లోనూ సమానంగా రాణిస్తేనే ఈ దశ విజయవంతంగా దాటగలం.