వైసీపీ సోషల్ మీడియా వ్యవహారాలకు సజ్జల భార్గవ దూరంగా ఉంటున్నారన్న ప్రచారం ఆ పార్టీలో ఆసక్తికర చర్చకు తెరలేపింది. టీడీపీ మహిళా నేతలపై అనుచిత పోస్టింగ్ ల విషయంలో కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళనతోనే సోషల్ మీడియా విభాగానికి ఆయన దూరంగా ఉంటున్నారని టాక్ నడుస్తోంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి సజ్జల భార్గవ పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ సమీక్ష సమావేశాల్లో జగన్ తో భార్గవ తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి కనిపిస్తోన్న సోషల్ మీడియా విభాగాన్ని పర్యవేక్షించే భార్గవ కనిపించకపోవడం పట్ల చర్చ జరుగుతోంది.
వైసీపీ హాయాంలో టీడీపీ మహిళా నేతలపై ఆ పార్టీ సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్ లు దర్శనమిచ్చాయి. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితను కూడా అప్పట్లో టార్గెట్ చేశారు. దీంతో వారంతా పోలిసులకు ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో తమను ఉద్దేశించి చేసిన అనుచిత పోస్టింగ్ లపై ఫిర్యాదులు చేసేందుకు వారంతా సిద్దం అవుతున్నారు.
వీటన్నింటిని అంచనా వేసే సజ్జల భార్గవ వైసీపీ సోషల్ మీడియా వ్యవహరాలకు దూరంగా ఉంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పైగా, భార్గవ నేతృత్వంలోని సోషల్ మీడియా అతి కూడా వైసీపీ పతనానికి ఓ కారణమనే విశ్లేషణల నేపథ్యంలో జగన్ సైతం భార్గవను పట్టించుకోవడం లేదని అందుకే ఆయన స్థానంలో నాగార్జున యాదవ్ కు సోషల్ మీడియా విభాగం బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది.