పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. గురువారం ఉదయం ఐదు గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏక కాలంలో మూడు చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంతో పాటు అల్లుడు నివాసంలో కూడా ఈడీ సోదాలు జరుపుతోంది.
తెలంగాణలో ఎన్నికలు పూర్తైన తర్వాత ఈడీ సోదాలు చేపట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ పెద్దలను టార్గెట్ చేసుకొని ఈడీ దూకుడుగా వ్యవహరిస్తుందని అనుమానాలు వ్యక్తం అవుతుండగా తాజాగా ఆ పార్టీ ఎమ్మెల్యే నివాసం, ఆయన కుటుంబ సభ్యుల ఇంట్లో సోదాలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. అనూహ్యంగా పటాన్చెరు ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించడానికి కారణం ఏంటనే చర్చ జరుగుతోంది.
మహిపాల్ రెడ్డి సోదరులు మైనింగ్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఓ కేసులో ఇటీవల ఆయన సోదరుడు అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చారు. వీరిపై గతంలో లక్డారం గనుల వ్యవహారంలో కేసు కూడా నమోదు అయ్యింది. ఈ కేసు ఆధారంగానే ఈడీ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి ఇంటితోపాటు ఆయన అల్లుడి నివాసంలో ఏకకాలంలో ఈడీ సోదాలు చేపట్టడం ఆసక్తి రేపుతోంది. కేంద్ర బలగాల బందోబస్తు మధ్య ఈ సోదాలు చేపడుతున్నారు ఈడీ అధికారులు.