కల్కి సినిమా రహస్య దేవనగరం ప్రస్థానం మరోసారి తెరపైకి తెచ్చింది. నాగ్ అశ్విన్ కల్కి కథని శంభలతో ముడిపెట్టాడు. ఈ సినిమా కోసం శంభల నగరాన్ని క్రియేట్ చేశానని చెప్పడం మరింత ఆసక్తిగా మారింది. శంభల గురించి ఇప్పటికే మిస్టరీ కథనాల్లో సమాచారం వుంది. కల్కి సినిమాలో కూడా ఈ ప్రస్తావన వుంది కాబట్టి.. ఒక్కసారిశంభల గురించిన విశేషాల్లోకి వెళితే..
శంభల ఓ దేవరహస్యంగా చెప్పబడుతోంది. శంభల అనేది సంస్కృత పదం. శాంతి స్థానమని దీని అర్ధం. హిమాలయాలలో వున్న బాహ్య ప్రపంచానికి తెలియని లోకం శంభల అని ఓ వాదన వుంది. హిమాలయాలలో మనుషులు చేరుకోలేని చోట ఆ నగరం వుందని కథనాలు వున్నాయి. అక్కడ ఎంతోమంది ఋషులు తపస్సు చేశారని పురాణాల్లో చెప్పబడింది. రామాయణ, మహాభారతాల్లో శంభల ప్రస్తావన వుంది.
బౌద్ధ గ్రంథాలు శంభలని భూతల స్వర్గమని పేర్కొన్నాయి. లోకంలో అరాచకం హద్దులు దాటితే శంభలలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లో తీసుకుంటారు కొన్ని గ్రంథాల్లో ప్రస్తావన వుంది. ఇక్కడే నుంచే కల్కి వస్తారని ఓ వాదన వుంది. బహుసా నాగ్ అశ్విన్ ఇదే పాయింట్ కనెక్ట్ అయ్యి వుంటుంది.
మోడరన్ హిస్టరీలో శంభల పేరు రాగానే హిట్లర్ ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ నగర విశిష్టతను తెలుసుకున్న హిట్లర్ 1930 లో రిసెర్చ్ కోసం ప్రత్యేక బృందాలని పంపించాడని, ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ దేవతలు సంచరించే పుణ్యభూమిగా శంభల ని పేర్కొన్నాడని చరిత్రకారులు ప్రస్తావిస్తుంటారు. అలాగే డాక్టర్ లాయోసిన్ అనే మరో పరిశోధకుడు శంభల అనేది భూమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అని పేర్కొన్నట్లు చెబుతుంటారు.
మొత్తానికి ఓ మిస్టీరియస్ నగరాన్ని తన కథలో భాగం చేసి కల్కిపై మరింత ఆసక్తిని పెంచాడు నాగ్ అశ్విన్.