అవును.. వైసీపీ, బీఆర్ఎస్ లది ఒకే కథ. తెలంగాణ సెంటిమెంట్ తో బీఆర్ఎస్ ఆవిర్భవించగా , వైఎస్ మరణం తర్వాత ఎమోషన్స్ తో వైసీపీ పురుడుపోసుకుంది. కారణాలు వేర్వేరు అయినా రెండు పార్టీలు సెంటిమెంట్ తో పురుడుపోసుకున్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఆ ఎమోషన్స్ క్యారీ చేయడంలో రెండు పార్టీలు సక్సెస్ ను కనబరిచాయి, కానీ సంస్థాగతంగా పార్టీలను బలోపేతం చేసుకోలేకపోయాయి. ఇటీవలి ఎన్నికల్లో రెండు పార్టీలు అధికారం కోల్పోయినా అనేక విషయాల్లో బీఆర్ఎస్ – వైసీపీల మధ్య సారూప్యత కనిపిస్తోంది.
రాజకీయాల్లో ఎమోషన్స్ తీవ్ర ప్రభావం చూపుతాయనేది బహిరంగ రహస్యమే. కానీ ఎల్లాకాలం ఎమోషన్స్ ఆశించిన ఫలితాలను పంచిపెట్టలేవు. ఈ విషయాలను అంచనా వేయడంలో అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ విఫలమయ్యాయి. ఫలితంగా రెండు పార్టీల కథ మళ్లీ మొదటికి వచ్చింది. తెలంగాణ సెంటిమెంట్ తో పడుతూ, లేస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించిన బీఆర్ఎస్ … పదేళ్లు అధికారంలో కొనసాగింది. ఈ పీరియడ్ లో సంస్థాగతంగా సరైన పునాది లేకుండానే బీఆర్ఎస్ వరుస విజయాలు సాదించింది అంటే ఆ ఎమోషన్స్ తోనే అని చెప్పుకోవాలి. అటు వైసీపీ కూడా వైఎస్ చరిష్మా, ఆయన మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జగన్ పై ప్రజల్లో సానుభూతి పెరిగింది. అదే సమయంలో ప్రజా సంకల్ప యాత్ర ఇవన్నీ కలిసి రావడంతో జగన్ అనుకున్న లక్ష్యాన్ని 2019లో రీచ్ అయ్యారు. కానీ, బీఆర్ఎస్ తరహాలో వైసీపీ కూడా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేయడకుండా ఉదాసీనంగా వ్యవహరించింది.
ఇరు పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరించారు. అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ఉద్యమకారులను విస్మరించి తప్పిదం చేస్తే…వైసీపీ కార్యాకర్తలను కాదని వాలంటీర్లను నమ్ముకొని మోసపోయింది. రెండు పార్టీలు తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకొని ఇప్పుడు దిక్కులు చూస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ , బీఆర్ఎస్ లకు అధికారం లేదు. గతంలో రెండు పార్టీలను క్రియాశీలకంగా నడిపించిన సెంటిమెంట్ లు పని చేసే పరిస్థితి లేదు. మళ్లీ రాజకీయ రంగ స్థలంపై నిలదొక్కుకోవాలంటే మొదటి అడుగుతోనే స్టార్ట్ చేయాలి. పార్టీలను సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి. ఇలా పుట్టుక, పతనంలోనూ రెండు పార్టీలది ఒకే కథగా కనిపిస్తోంది.