సొంత ఇంటికి ప్రజాధనంతో సోకులు చేయించుకున్న జగన్ రెడ్డి వాటిని తిరిగి ఇచ్చే ఆలోచనల్లో లేరు. మామూలుగా అయితే పదవి పోయిన పదిహేను రోజుల్లో ఇచ్చేయాలి. ప్రజాధనంతో కొన్న సామాగ్రి మాత్రమే కాకుండా.. క్యాంప్ కార్యాలయంగా వాడినందున అక్కడ ప్రభుత్వానికి చెందిన కంప్యూటర్లు, ఇతర సామాగ్రి కూడా ఉన్నాయి. కానీ వేటినీ ఇవ్వలేదు. పదిహేను రోజుల్లో తిరిగి ఇవ్వకపోవడంతో ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.
ఫర్నీచర్ దొంగ అంటూ టీడీపీ ఆరోపణలు చేయడంతో వైసీపీ స్పందించినప్పుడు… వాటికి డబ్బులు చెల్లిస్తామని చెప్పింది. ఈ మేరకు లేఖ రాశామని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఎవరికి రాశారో… ఏమని రాశారో మాత్రం చెప్పలేదు. లేఖ రాసి ఉంటే బయట పెట్టుకుని పరువు కాపాడుకునేవాళ్లు. లేఖ రాయలేదని తాజా తేలిపోయింది. మొత్తం ఫర్నీచర్.. ప్రజాధనంతో సొంత ఇంటికి పెట్టుకున్న ఖర్చు మొత్తం ఇచ్చేయాలని ప్రభుత్వం నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.
సీఎంగా ఉంటూ జగన్ ప్రజాధనం దుర్వినియోగం చేయడంపై ఇప్పటికే దేశవ్యాప్త చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ వ్యవహరం కూడా బయటపెడితే మరోసారి సంచలనం అవుతుంది. ఈ గుట్టు బయటపడకుండా అధికారికంగా తమ వద్ద ఉన్న సరంజామా ఇచ్చేయకుండా.. జగన్ పరువుపోయేలా చేసుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.