ఏపీ అంటేనే అమరావతి, పోలవరం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతి బ్రాండ్ ను దెబ్బతీయాలని ప్రయత్నించినా ఇక్కడి మట్టి మహత్యం వలన అమరావతిని నిలబెట్టుకోగలిగామన్నారు. పోలవరం పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా నీరు అందించాలని భావిస్తే పోలవరం పనులను ఎక్కడిక్కడే నిలిపివేశారని మండిపడ్డారు. ఇటీవల పోలవరాన్ని సందర్శించినప్పుడు అక్కడి పరిస్థితులను చూసి బాధ వేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం, అమరావతి వ్యక్తిగత సంపద కాదు…ఇది ప్రజలందరి సంపద కేంద్రమన్నారు చంద్రబాబు. సంపద సృష్టిస్తే అది సమాజానికి ఉపయోగపడుతుందని కానీ, ఉన్మాదులు ఈ విషయాలను మరిచి ఐదేళ్లలో విధ్వంసానికి పాల్పడ్డారని విమర్శించారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి మూర్ఖత్వం వలన ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చులు డబుల్ అయ్యే పరిస్థితి నెలకొందన్నారు.
ప్రజలు ఆశీర్వదిస్తే ప్రజల మెప్పు కోసం పాలించాలని కానీ, ప్రజా వేదిక కూల్చివేతతో పరిపాలన ప్రారంభించారని జగన్ పై చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజధాని నిర్మాణం కోసం మేము ప్రయత్నిస్తే పైపులు, ఇసుకను కూడా దొంగిలించారని ఆరోపించారు. ఇక్కడ ప్రభుత్వ భవన నిర్మాణాలు చేపడితే ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండాల్సిన చోట తుమ్మ చెట్లు మోలిచాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో తాము అన్ని ప్రాంతాల సమగ్రమైన అభివృద్ధి కోసం స్పష్టమైన విధానం ప్రకటించామన్నారు. అయినా రాజధానిపై బురదజల్లే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఐదేళ్లలో ఏపీకి రాజధాని ఏదంటే చెప్పుకోలేని అవమానకర పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. గతంలో లాగా రౌడీయిజం చేశారో వారి ఆటలను కొనసాగనివ్వనని.. అవసరమైతే నిర్మొహమాటంగా అణచివేస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.