జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే విషయంలో నాన్చుతూనే ఉన్నారు. వెళ్తానని చెప్పడం లేదు.. డుమ్మా అని చెప్పడంలేదు. పార్టీ కార్యవర్గ సమావేశం పేరుతో నేతలందర్నీ పిలిపించుకున్నారు. పోటీ చేసిన వారిలో చాలా మంది వచ్చారు. అందరూ వచ్చాక.. జగన్ వచ్చి అరగంట సేపు ప్రసంగించి.. మ..మ అనిపించారు. అదే పార్టీ కార్యవర్గ సమావేశం. ఓ పద్దతి, పాడూ లేకుండా.. నిర్వహించేసి తాను చెప్పాలనుకున్నది చెప్పి వెళ్లిపోయారు.
దీంతో అరగంటలో సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చి నోరున్న వాళ్లు మాట్లాడారు. అయితే జగన్ రెడ్డి ఏం మాట్లాడారో తర్వాత ఎడిటింగ్ చేసి విడుదల చేశారు. జగన్ చచ్చిపోలేదు.. ఓడిపోయాడు.. చచ్చేదాకా కొట్టాలని స్పీకర్ గా ఎన్నిక కాబోయే లీడర్ మాట్లాడుతున్నారని ఇలాంటి సభకు వెళ్లి మనమేమైనా చేయగలమా అని ప్రశ్నించారు. ప్రజల్లోనే పోరాడదామని ఆయన సూచిస్తున్నారు. అంటే అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు దాదాపుగా లేనట్లుగానే భావిస్తున్నారు.
ప్రమాణ స్వీకారానికి మాత్రం జగన్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రమాణ స్వీకారం చేయకపోతే కొంత సమయం చూసి అనర్హతా వేటు వేస్తారు. ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉంటారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎన్నికవుతారు. అయ్యన్న కన్నా బుచ్చయ్యే బెటర్ అని.. ఆయన ఎదుట ప్రమాణానికి జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో మొదటే ప్రమాణం చేసే అవకాశం లేదు. అల్ఫా బెటికల్ ఆర్డర్ లో ఆయనకు పిలుపు వస్తుంది. ఆ రెండు నిమిషాలు సభకు హాజరైన ప్రమాణం చేసి వెళ్లిపోయే అవకాశం ఉంది.