మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని వరంగల్ రాజకీయాల్లో గుప్పు మంటోంది. రేవంత్ రెడ్డికి రాజీ ప్రతిపాదన పంపారని అన్నీ కలిసిపోయి పని చేద్దామని చెప్పారని దానికి రేవంత్ ఒప్పుకున్నారని అంటున్నారు. అయితే దీన్ని నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఎర్రబెల్లి వల్ల రేవంత్ ఎంత నష్టపోయారో ఆయనకు తెలుసు… అదే సమయంలో ఎర్రబెల్లి వల్ల కాంగ్రెస్ కు ఒక్క ఓటు కూడా అదనంగా రాదు. ఆయన వల్ల లాభం కూడా లేదు. మరి ఎందుకు చేర్చుకుంటారన్న ప్రశ్నలు వస్తున్నాయి.
పాత అంశాలను పక్కనపెట్టి దయాకర్ రావు ను పార్టీ లోకి తీసుకొంటే కాంగ్రెస్ పార్టీ లాభమా అంటే ఏమీలేదు. దయాకర్ రావు పై కొత్త ఎమ్మెల్యే భారీ మెజార్టీతో గెలిచారు. ఎర్రబెల్లి ఎమ్మెల్యే అయినా పార్టీ లోకి తీసుకుంటే ఒక ఎమ్మెల్యే బలం పెరుగుతుంది అనుకున్నా ఆయన ఎమ్మెల్యే కాదు. అందుకే ఆయనను కాంగ్రెస్ లోకి తీసుకోరని అంటున్నారు. ఆయన బీజేపీలో చేరితే ఆ పార్టీకి మేలన్న చర్చలు ఉన్నాయి.
దయాకర్ రావు గతంలో ప్రాతినిధ్యం వహించిన వర్ధన్నపేట నియోజకవర్గం, మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి బలం లేదు ఈ రెండు నియోజకవర్గాల్లో దయాకర్ రావు కు అనుచరగణం ఉంది కాబట్టి. బిజేపి పార్టీకి లాభం జరుగుతుంది. ఇదే చెప్పి పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీజేపీతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. కానీ ఫోన్ ట్యాపింగ్ కేసుపై పోరాడుతున్నందున ఎర్రబెల్లి చేరికను బీజేపీ నేతలు ఆపారంటున్నారు. బీఆర్ఎస్లో ఉండాలని ఎర్రబెల్లి అనుకోవడం లేదు. జాతీయపార్టీలోకి వెళ్తేనే సేఫ్ అనుకుంటున్నారు.