”పవన్ కల్యాణ్‌ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం” అంటూ వైకాపా ప్రబుద్ధులు సినిమా డైలాగులు వల్లేశారు. ఐదేళ్లు తిరిగేసరికి, అలా చెప్పిన వాళ్లంతా అసెంబ్లీ గేటు బయటే ఉండిపోయారు. ఇప్పుడు.. ఈ రోజు పవన్ కల్యాణ్ దర్జాగా అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నాడు. అది కూడా గౌరవ మంత్రి హోదాలో. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో అధికార పక్షం తనదే, ప్రతి పక్షంలోనూ తనే.
పవన్ కల్యాణ్‌ని అసెంబ్లీలో చూడాలన్నది ఆయన అభిమానుల కల. అందుకు పదేళ్లు పట్టింది. 2014లో పార్టీని స్థాపించినా, అప్పుడు పోటీ చేయలేదు. 2019లో పోటీ చేసినా రెండు చోట్లా ఓడిపోయాడు. ఆ పార్టీకి దక్కింది ఒకే ఒక్క సీటు. అప్పటి నుంచి పవన్ ఒంటరి పోరాటం చేస్తూనే వచ్చాడు. ఐదేళ్ల కాలంలో పార్టీని కాపాడుకోవం ఒక ఎత్తయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమాయాత్తం అవుతూ, పార్టీని తీర్చిదిద్దుకోవడం మరో ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ పవన్ తన పట్టుదలని చూపించాడు. ప్రజారాజ్యం స్థాపించి, 18 సీట్లు తెచ్చుకొన్న చిరంజీవి, తన పార్టీని ఐదేళ్ల పాటు కాపాడుకోలేక, కాంగ్రెస్‌లో విలీనం చేయాల్సివచ్చింది. ఆ చేదు అనుభవాలు వెంటాడినా నిందలు, నిష్టూరాలు, అనుమానాలు, అవమానాలు ఉక్కిరిబిక్కిరి చేసినా పవన్ చలించలేదు. `పార్ట్ టైమ్ పొలిటీషియన్`, `ప్యాకేజీ స్టార్` అంటూ ప్రత్యర్థులు హేళన చేసినా, పట్టించుకోలేదు. కోట్లు సంపాదించిపెట్టే సినిమాల్ని వదులుకొని, జేబులోని డబ్బులు బాధితులకు పంచిపెట్టి, నిజమైన నాయకుడిలా ఈ పదేళ్లు ఎదిగిన తీరు… నిజంగా ఓ అద్భుతమైన పాఠం. పవన్ కష్టం ఫలించింది. త్యాగాల్ని ప్రజలు గుర్తించారు. అందుకే 100 శాతం స్ట్రయిక్ రేట్ తో 21 అసెంబ్లీ స్థానాల్ని, 2 పార్లమెంటు సీట్లనీ కట్టిపెట్టారు. కూటమి విజయంలో తన పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. క్లిష్టమైన సమయంలో బీజేపీని బలవంతంగా కూటమిలోకి లాక్కొచ్చి, ఇప్పుడు కేంద్రంలోనూ పట్టు సంపాదించే పరిస్థితి వచ్చిందంటే.. దానికి పవన్ కల్యాణే కారణం.
ఇప్పుడు పవన్ అసెంబ్లీలో ఎలా మాట్లాడతాడు? తన బాధ్యత ఎలా నెరవేరుస్తాడన్నదే అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్ అధికారం పంచుకోకపోతే… ఇప్పుడాయన ప్రతిపక్ష నేతగా ఉండేవాడు. కానీ కూటమి లో ఆయన భాగం అందుకొన్నారు. అందుకే అధికార పక్షంలో ఉంటూనే, ప్రతిపక్షంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే, ప్రజల వహించాల్సివచ్చినప్పుడు, వాళ్ల కోసం గొంతెత్తడానికీ, ప్రజల తరపున మాట్లాడడానికి ఇప్పుడు అసెంబ్లీలో ఓ బలమైన గొంతు కావాలి. జగన్ రెడ్డి కేవలం 11 సీట్లతో సరిపెట్టుకోవడం వల్ల ఆయన ప్రతిపక్ష హోదా కోల్పోయారు. కనీసం జగన్‌ని అసెంబ్లీ చూడడం కూడా అనుమానమే. మరి.. ప్రతిపక్ష నేత లేని లోటు పవన్ తీర్చాల్సి ఉంటుంది.
ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా – అని చెప్పిన పవన్.. ఇప్పుడు కూడా ప్రశ్నిస్తారా? ఆయన ఓ సమస్యని భుజాలపై వేసుకొంటే దాన్ని ఎలా సాల్వ్ చేస్తారు? అసెంబ్లీని కౌరవ సభగా మార్చేసిన వైకాపా నేతల తీరుకు ఇప్పుడు పవన్ భిన్నంగా ఏం చేయబోతున్నారు? ఇవన్నీ ఆసక్తి రేకెత్తించేవే. వాటికి సమాధానం త్వరలోనే చూడబోతున్నాం. ఆల్ ది బెస్ట్ పవన్!!