భారత రాష్ట్ర సమితిలో అంతర్గతంగా అలజడి హైరేంజ్ లో ఉంది. పార్టీ ముఖ్య నేతలంతా ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో చాలా మంది నేతలు రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి వారిపై ఒత్తిడి వస్తోంది.
ప్రస్తుతం 35 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారు. వీరిలో కనీసం ఇరవై మందిని పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మిగతా వారిపై బీజేపీ వల విసురుతోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఈడీ దాడులు రాజకీయమేనని అనుకుంటున్నారు. ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తోంది. కొద్ది రోజుల కిందట నలుగురు ఎమ్మెల్యేలను కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకుని మాట్లాడారు. కానీ వారెవరూ పార్టీలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవ్వాలని అనుకుంటున్నారు. అంతకు ముందే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా పోయేలా చేయాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. . బీజేపీ కూడా ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రధాన ప్రతిపక్షంగా తామే వ్యవహరించాలని బీజేపీ అనుకుంటోంది. రాజకీయ భవిష్యత్ బీజేపీకే ఉంటుందన్న ఉద్దేశంతో కొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపే చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమకలాకర్ ఇప్పటికే చర్చలు పూర్తి చేసినట్లుగా చెబుతున్నారు.
ఎమ్మెల్యేలు కాకుండా ఇతర పార్టీ ముఖ్య నేతలు కూడా వలస బాటలో ఉండటం బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేదే. ఈ సంక్షోభాన్ని కేసీఆర్ ఆపగలుగుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.