ఎస్..తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయం ఆశ్చర్యపరుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను విపరీతంగా ప్రోత్సహించి… అధికారం కోల్పోయాక బీఆర్ఎస్సే బాధిత పక్షం కావడంతో స్వరం మార్చింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆర్తనాదాలు వినిపించడం స్టార్ట్ చేసింది.
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంపై బీఆర్ఎస్ నేతలు పోచారం ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. పోచారం కాంగ్రెస్ లో చేరడం అనైతికమంటూ నైతిక రాజకీయాల గురించి ఆ పార్టీ లీడర్లు ఒక్కొక్కరు లెక్చర్లు ఇచ్చేస్తున్నారు. నిజానికి , ఈ విషయంలో బీఆర్ఎస్ కు కనీస మద్దతు లభించిందేమో కానీ, గతంలో అనుసరించిన విధానాలే ఆ పార్టీకి శాపంగా పరిణమించాయి.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు ప్రతిపక్షమే అనేది ఉండొద్దనే టార్గెట్ తో కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. అభివృద్ధి పేరిట అనైతిక రాజకీయంతో ప్రతిపక్షమే లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధికార కాంగ్రెస్ లో చేరుతుండటంతో ప్రజాస్వామ్యం అంటూ కొత్తగా పలవరిస్తోంది.
కానీ, బీఆర్ఎస్ గత రాజకీయ అనుభవాల దృష్ట్యా ఆ పార్టీకి తెలంగాణ ప్రజానీకం నుంచి మద్దతు లభించకపోగా…ఆ పార్టీ నేతల రాజకీయాలను చూసి నవ్వుకుంటున్నారు. బాధిత పక్షంగా మారితే తప్ప పార్టీ ఫిరాయింపుల నొప్పి తెలిసిరాలేదా అంటూ బీఆర్ఎస్ ను కడిగిపారేస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అంటూ ఎత్తిపొడుస్తున్నారు.