ఎన్నికల్లో ఓటమికిపైకి ఈవీఎంలని జగన్ చెబుతున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం.. పరిస్థితుల్ని మెరుగుపర్చుకోకపోతే కడపలో కూడా ఠికాణా ఉండదని గుర్తించారని చెల్లితో రాజీచేయాలని తల్లి కి రాయబారం పంపారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి చెబుతున్నారు. ఈ ఆదినారాయణరెడ్డి ఒకప్పుడు వైఎస్‌కు..తర్వాత జగన్‌కు ఆప్తుడు. తర్వాత జగన్ తీరుతో విరక్తి చెంది టీడీపీలో చేరారు. తర్వాత బీజేపీలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ప్రమాణ స్వీకారం తర్వతా లాబీల్లోకి వచ్చిన ఆయన ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
జగన్ రాజీ రాయబారాన్ని షర్మిల తేలికగా తోసిపుచ్చారు. జగన్ నే కాంగ్రెస్ లోకి రావాలని స్పష్టం చేశారంటున్నారు. ఇటీవల షర్మిల కూడా అలాగే మాట్లాడుతున్నారు. వైసీపీ పిల్ల కాలువ.. కాంగ్రెస్ సముద్రం… అన్నీ సముద్రంలో కలవాల్సిందేనన్నారు. తెర వెనుక ఏమైనా జరుగుతుందేమో కానీ.. ఆదినారాయణరెడ్డి చెప్పేవి గాలి కబుర్లు కాదన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. త్వరలో వివేకాహత్య కేసులో అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయమంటున్నారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్ లోకి వెళ్లారని ప్రకటించారు. వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోందని స్వయంగా మిధున్ రెడ్డి కూడా బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని చెబుతున్నారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు. కానీ వైసీపీ ఎంపీలు అవసరం లేదని బీజేపీ పెద్దలు చెబుతున్నాని అయినప్పటికీ తాము చేరుతామని మిథున్ రెడ్డి ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారని ఆదినారాయణ రెడ్డి చెబుతున్నారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిధున్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ వెల్లడించారు.
పెద్దిరెడ్డి ఐదేళ్లుగా చేసిన నిర్వాకాలతో ఎప్పటికప్పుడు భయం భయంగా ఉంటున్నారు. ఇప్పుడు పుంగనూరుకూ వెళ్లే పరిస్థితి లేదు. అందుకే.. వారు బీజేపీ వైపు చూస్తున్నారంటే ఎవరూ ఆశ్చర్యపోవడం లేదు.