ప్రభాస్ తో సినిమా అంటే చాలు. పోస్టర్ వేయ్యాల్సిన అవసరం లేదు. టీజర్ చూపించక్కర్లెద్దు. బిజినెస్ మొదలైపోతుంది. అదీ ప్రభాస్ రేంజ్. అశ్వనీదత్ తన బ్యానర్లో అత్యంత ఖరీదైన సినిమాని ప్రభాస్‌తో తీశారంటే అదే నమ్మకం. తన ఆస్తులన్నీ కరిగించి సినిమాపై ధార బోశారంటే, కేవలం ప్రభాస్ ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రమే! దానికి తగ్గట్టుగానే ‘కల్కి’ బిజినెస్ జరిగింది. సినిమా విడుదలై, ఎన్ని రికార్డులు తుడిచిపెడుతుంది? అశ్వనీదత్‌కు ఎన్ని లాభాలు తెచ్చి పెడుతుంది? అనే విషయాలు పక్కన పెడితే, ప్రస్తుతానికి ‘కల్కి’ ఓ ప్రాఫిట్ వెంచరే! ఈ సినిమా కోసం ప్రభాస్ ఎంత అందుకొన్నాడు అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. టాలీవుడ్ లో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
ఈ సినిమా కోసం ప్రభాస్ అక్షరాలా రూ.150 కోట్ల పారితోషికం అందుకొన్నాడని టాక్. ఈ మొత్తం తనకు మూడు వాయిదాలలో దక్కింది. అంటే ఒక్కో వాయిదాకూ రూ.50 కోట్లు. సలార్ సినిమా కోసం ప్రభాస్ తీసుకొన్నది రూ.120 కోట్లే. ఇప్పుడు మరో రూ.30 కోట్లు పెరిగింది. దాంతో సౌతిండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోల సరసన ప్రభాస్ చేరిపోయినట్టైంది. తమిళ స్టార్ విజయ్ కూడా మొన్నటి వరకూ రూ.150 కోట్లే అందుకొన్నాడు. రజనీకాంత్, విజయ్, ప్రభాస్… ఇప్పుడు దక్షిణాదిన పారితోషికాల్లో టాప్ 3 వీళ్లే. ఓ తెలుగు హీరో రూ.150 కోట్ల పారితోషికం తీసుకొంటున్నాడంటే, తెలుగు సినిమా స్టామినా ఏ స్థాయికి ఎదిగిందో అర్థం చేసుకోవొచ్చు. ‘కల్కి’ గనుక అనుకొన్న స్థాయిలో విజయాన్ని అందుకొంటే, తదుపరి సినిమాకు రూ.200 కోట్లు డిమాండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.