ఓటమి బాధనో… అసెంబ్లీలో అంతమంది టీడీపీ ఎమ్మెల్యేలను చూస్తుంటే గతంలో తాను చేసిన మాటలు గుర్తుకొస్తున్నాయో… మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారు.
మొదటిరోజు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార సమయానికి అసెంబ్లీకి వచ్చిన జగన్… ప్రమాణస్వీకారం చేసి నేరుగా ఛాంబర్ కు వెళ్లిపోయారు. ప్రమాణస్వీకారం చేసే ముందు కొద్ది నిమిషాలు మాత్రమే సహచర వైసీపీ ఎమ్మెల్యేలతో కూర్చున్నారు.
రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉందని వైసీపీకి తెలుసు. అసెంబ్లీ సాంప్రదాయల ప్రకారం అధికార, విపక్ష నేతలంతా కలిసి ఎన్నికైన స్పీకర్ ను తన సీటు వద్దకు తీసుకెళ్తారు. స్పీకర్ తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటారు.
కానీ, స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎంపిక అవ్వటం ఇష్టంలేదో… అసెంబ్లీలో అంతమంది అధికారపక్షం ముందు సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోవటం జగన్ కు ఇష్టం లేదో కానీ రెండో రోజు వైసీసీ అసెంబ్లీకి డుమ్మా కొట్టింది. జగన్ ఐదు రోజులపాటు పర్యటన కోసం పులివెందులకు వెళ్లిపోయారు.
పులివెందుల వైఎస్ ఫ్యామిలీ అడ్డాగా ఉండేది. కానీ, మొన్నటి ఎన్నికల్లో ఆ పునాదులు కూడా కదిలిపోయాయి. సీఎంగా భారీ మెజారిటీతో గెలుస్తారని భావించినా, పులివెందులలోనూ కష్టపడాల్సి వచ్చింది. సీఎంగా ఉన్నప్పుడు పట్టించుకోలేదని… ఇప్పుడైనా వస్తారా అన్న అనుమానాలు మొదలైన నేపథ్యంలో జగన్ పులివెందుల పర్యటన చేపట్టారు.