ఇంకా సాక్షి ఛానెల్ తీరేమి మారడం లేదు. ప్రధాన స్రవంతి మీడియా అనే సోయి కూడా లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ఓ సాధారణ యూట్యూబ్ ఛానెల్ కన్నా అధ్వానంగా ఛానెల్ ప్రసారాలను కొనసాగిస్తోంది. శుక్రవారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేసిన సాక్షి.. అందులో కేవలం వైసీపీ ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారాన్ని మాత్రమే ప్రత్యేకంగా యూట్యూబ్ లో పొందుపరిచింది. కూటమి సభ్యుల ప్రమాణస్వీకార వీడియోలను పక్కనపెట్టి కేవలం ఓ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తామని చెప్పకనే చెప్పింది.
సాక్షి ప్రసారాలపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అది పూర్తిగా వైసీపీ మౌత్ పీస్. వైసీపీ అధికారం కోల్పోయాక అయినా సాక్షి కొంత మారుతుందని అనుకున్నారు. ప్రజలు ఛీ కొట్టకుండా ఉండేలా కథనాలను ప్రసారం చేస్తుందని, తీరా ఎన్నికలకు ముందు ప్లాన్ మార్చుతుందని అంచనా వేశారు. కానీ సాక్షి మాత్రం వండివార్చిన కథనాలనే ప్రసారం చేస్తూ… ఆ ఛానెల్ ఇంకా మారదు అని ప్రజలతోనే ఛీకొట్టించుకునేలా వ్యవహరిస్తోంది. ఆ ఛానెల్ ప్రసారం చేసే కథనాలపై విశ్వసనీయత పెరగాలంటే కొంతలో కొంతైనా స్వతంత్రంగా వ్యవహరించాలి. ఆ సోయి కూడా లేకుండా కథనాలను ప్రసారం చేస్తూ ప్రజల్లో మరింత పలుచన అవుతోంది.
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం అక్రమ కట్టడమని తేలడంతో ఆ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. దీంతో ఏపీలో టీడీపీ విధ్వంసానికి శ్రీకారం చుట్టిందని కథనాలను ప్రసారం చేస్తోంది. అసలు వాస్తవాలను పట్టించుకోకుండా తమ అధినేతను సంతృప్తి పరచడం కోసం తప్పుడు కథనాలను విరివిగా ప్రసారం చేయడం ప్రారంభించింది. గతంలో ప్రజా వేదికను కూల్చినప్పుడు ప్రజా పాలనకు అంకురార్పణ అని.. ఇప్పుడు వైసీపీ అక్రమ కట్టడాల కూల్చివేతకు దిగితే మాత్రం విధ్వంసం అంటూ సాక్షి తన పరువును తనే తీసుకుంటుంది. ఇప్పటికే ఆ ఛానెల్ ను చూడటం మానేశారు మెజార్టీ ఏపీ వాసులు. ఇలాంటి కథనాలతో సాక్షి మరింత పతనావస్థకు చేరుకోవడం మాత్రం ఖాయం.