విశాఖ వైసీసీ ఆఫీసుకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎండాడ వద్ద వందకోట్లకుపైగా ఖరీదైన రెండుఎకరాల స్థలాన్ని ఎకరానికి ఏడాదికి వెయ్యికి చొప్పున లీజుకు తీసుకుని భవనాన్ని కట్టేశారు. ఓ వంద కోట్లతో కట్టిన ఆ భవనానికి ఒక్కటంటే ఒక్క పర్మిషన్ తీసుకోలేదు. దీంతో నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత కూడా పర్మిషన్లు తీసుకోకపోగా… ఏం చేస్తారో చేసుకోండన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
రాత్రికి రాత్రి పర్మిషన్ల కోసం కుట్రలు చేశారు. కింది స్థాయి అధికారులతో అనుమతుల కోసం రెండు దశలు దాటించారు. ఆన్ లైన్ లాగిన్ లో ఇద్దరు అధికారులు ప్లాన్లు అప్రూవ్ చేసేందుకు ప్రయత్నించారు. ఇదంతా కలెక్టర్ మల్లిఖార్జున ఆధ్వర్యంలో సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన జవహర్ రెడ్డి కి అసైన్డ్ ల్యాండ్స్ కొనుగోలు చేయడానికి సాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు విశాఖ ఆఫీసును కూడా కట్టేసిన తర్వాత లీగల్ చేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వం మారినా ఆయన తీరు మారలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో వైసీపీ ఆఫీసుకు నోటీసులు అంటించారు. వారంలో వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క అనుమతి లేకుండా నిర్మాణం చేయడమే కాకుండా… ప్రజల ఆస్తి రెండు ఎరాల్ని ఏడాదికి రెండు వేలకే లీజుకు తీసుకోవడం వారి దోపిడీ తత్వాన్ని బయట పెడుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. దాదాపుగా పూర్తి అయిన వైసీపీ ఆఫీసును కూల్చివేసే అవకాశం ఉండదని… స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకు ఉపయోగించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.