ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. గత శాసన సభలో తనకు ఎదురైన అనుభవాలను వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు. తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కానీ గత శాసన సభలో జరిగిన అరాచకాలను గతంలో ఎప్పుడు చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వేధించడం, దుర్భాషలాడటం, హేళన చేయడం వంటి పనులు చేశారని చంద్రబాబు వాపోయారు. సభలో లేని వ్యక్తుల గురించి సైతం మాట్లాడి అవమానాలకు గురి చేశారని గతంలో తన కుటుంబానికి ఎదురైన అవమానాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు.
తన గురించి మాత్రమే కాకుండా, తన భార్య గురించి కూడా వైసీపీ సభ్యులు అనుచితంగా మాట్లాడారని వాటిపై చర్యలు తీసుకోవాలని కోరితే మైక్ కట్ చేశారన్నారు. నా సతీమణి గురించి మాట్లాడటమే కాకుండా ఆడబిడ్డలను అవమానించారు. వైసీపీ ఎమ్మెల్యేల నీచమైన భాషను తట్టుకోలేక నాడు ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ అంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశానన్నారు. ఆనాడే ముఖ్యమంత్రిగానే సభకు హాజరు అవుతానని చెప్పానని గత సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.
ప్రజల మెప్పుతో అధికారంలోకి వచ్చామన్న చంద్రబాబు.. ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్ లో ఏ ఆడబిడ్డకు అవమానం జరగకుండా చర్యలు చేపడుతామన్నారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. గతంలో వైసీపీ సభ్యులు వ్యవహరించినట్టుగా బూతులు, వ్యక్తిత్వ హననాలకు పాల్పడవద్దన్నారు. తెలుగు గడ్డ రుణం తీర్చుకోవాలన్నదే తన కోరిక అని ఆ దిశగా అందరూ పని చేయాలన్నారు. ప్రస్తుత అసెంబ్లీ గౌరవ సభకు నిదర్శనంలా ఉండేలా అందరం కృషి చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.