నలుగురు, అంతకన్నా ఎక్కువ సంతానం ఉంటే ఇకపై ఇన్ కం ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు తీసుకున్న రుణాలకూ సబ్సిడీ వర్తిస్తుందని ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఈ ఆఫర్ ఇండియాలో కాదండోయ్..ఐరోపా దేశం హంగేరీలో మాత్రమే.
ప్రపంచంలోని మెజార్టీ దేశాలను జనాభా పెరుగుదల సమస్య వేధిస్తుంటే… హంగేరిని మాత్రం జనాభా క్షీణత వేధిస్తోంది. జనాభా పెరుగుదల కోసం ఇతర దేశాల నుంచి వలసలను ఆహ్వానిస్తోన్న హంగేరీ ప్రభుత్వం తమ దేశంలో జనాభాను పెంచేందుకు వినూత్నమైన ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా నలుగురు లేదా అంతకంటే ఎక్కువమంది సంతానం ఉన్నవారు ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఆ దేశ ప్రధాని వికోర్ట్ అర్బన్ స్పష్టం చేశారు.
ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలు కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా సబ్సిడీలు కూడా ఇస్తామని ప్రధాని వెల్లడించారు. పిల్లల పెంపకం కోసం 21వేల శిశు గృహాలను కూడా ప్రారంభిస్తామని తెలిపింది. అంటే చిన్నారుల తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్తే వారిని ఈ శిశు గృహాలే చూసుకుంటాయన్నమాట. ఇలాంటి వీటి ద్వారా నైనా దేశంలో జనాభా పెరుగుతుందని ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు హంగేరీ ప్రధాని తెలిపారు.