వడ్డించేవాడు మన వాడయితే పంక్తిలో ఏ మూల కూర్చొన్నా పరువలేదన్నట్లు, ప్రధాని నరేంద్ర మోడియే స్వయంగా హాజరయ్యే సాంస్కృతిక కార్యక్రమానికి అనుమతులకు కరువేమిటి? ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్-రవిశంకర్ ఈరోజు నుండి డిల్లీ సమీపంలో యమునా తీరాన్న నిర్వహించబోతున్న ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాల గురించి.
భారత్ తో సహా వివిధ దేశాలకు చెందిన సుమారు 35 లక్షల మంది ఈ సాంస్కృతిక ఉత్సవాలకి హాజరవవచ్చని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు. అందుకు వీలుగా యమునా నది ఒడ్డున సుమారు 150 ఎకరాలలో విస్తీర్ణంలో బారీ వేదికలు వగైరా ఏర్పాటు చేయబడుతున్నాయి. దాని కోసం ప్రభుత్వం అవసరమయిన అన్ని అనుమతులు మంజూరు చేసింది కూడా.
అయితే అక్కడ సుమారు 50-75 ఎకరాలలో రైతులు పంటలు సాగు చేసుకొంటున్నారు. వాటన్నిటినీ ఈ ఉత్సవ నిర్వాహకులు పొక్లెన్లు పెట్టి ద్వంసం చేసారు. ఈ ఉత్సవాలకు హాజరయ్యే లక్షలాది మందికి అవసరమయిన సౌకర్యాలు కల్పించేందుకు ఆ ప్రాంతం అంతా పూర్తిగా చదునుచేసి దాని రూపురేఖలు పూర్తిగా మార్చివేశారు. రైతుల, పర్యావరణ ప్రేమికుల అభ్యంతరాలను పట్టించుకోకుండా ఉత్సవాల నిర్వహణకు బారీ ఏర్పాట్లు చేసుకొన్నారు.
దానిపై కొందరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుని ఆశ్రయించగా, దాని చైర్మెన్ స్వతంత్ర కుమార్ ఈ సమయంలో ఉత్సవాలను అడ్డుకొనే శక్తి తమకు లేదని నిస్సాహయతను వ్యక్తం చేసింది. కానీ యమునా తీరంలో పర్యావరణానికి నష్టం కలిగించినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు రూ. 5కోట్లు జరిమానా విధించి, దానిని శుక్రవారంలోగా చెల్లించాలని ఆదేశించింది. ఒకవేళ చెల్లించకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని తన నోటీస్ లో పేర్కొంది.
దానిపై రవిశంకర్ స్పందిస్తూ “మేము ఏ తప్పు చేయలేదు. కనుక గ్రీన్ ట్రిబ్యునల్ కి విధించిన జరిమానాను చెల్లించదలచుకోలేదు. అవసరమయితే జైలుకయినా వెళతాను కానీ ఒక్క పైసా కూడా చెల్లించే ప్రసక్తే లేదు,” అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
దీనిపై భారతీయ కిసాన్ మజ్దూర్ సమితి అనే స్వచ్చంద సంస్థ సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తే, ఆఖరు నిమిషంలో వచ్చి పిర్యాదు చేస్తే ఎలాగ? ప్రచారం కోసమే కదా పిటిషన్ వేసింది?” అని ప్రశ్నించి ఆ పిటిషన్ న్ని తిరస్కరించింది. అందుకే వడ్డించేవాడు మన వాడయితే పంక్తిలో ఏ మూల కూర్చొన్నా పరువలేదననే మాట నిజమని నమ్మవలసి వస్తోంది.
ఈ వివాదాలను చూసి ఈ ఉత్సవాలకు హాజరు కాకూడదని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, జింబాబ్వే రాష్ట్రపతి రాబార్ట్ ముగాబే నిర్ణయించుకొన్నారు. ప్రధాని నరేంద్ర మోడి, ఇతర కేంద్రమంత్రులు, దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. భాజపా, దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు కూడా హాజరవుతారని వేరేగా చెప్పనవసరం లేదు. అటువంటప్పుడు ఏ కోర్టు మాత్రం ఏమి చేయగలదు తన అసహాయతను వేరే రూపంగా ఎవరిపైనో వెళ్ళగ్రక్కడం తప్ప!