ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే రోల్ మారిపోయింది. టీడీపీ అధికారంలోకి రావడంతో గతంలో రాసినంత మసాలాతో ఆయన రాయలేకపోవచ్చు. ఇక ఆయన చేయగలిగేది.. ఇవ్వగలిగేది సలహాలే. అందుకే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తొలి వారంలోనే ఆయన సలహాలతో తన వారాంతపు పలుకుల్ని నింపేశారు.
అధికారయంత్రాగం ప్రక్షాళనలో చంద్రబాబు మొహమాటాన్ని సమర్థించేందుకు ఆర్కే ప్రయత్నించారు. జగన్ రెడ్డి హయాంలో నిబంధనలు అతిక్రమించి పని చేసిన వారందర్నీ పక్కన పెడితే పని చేసే వారే ఉండరన్నట్లుగా ఆర్కే చెప్పుకొచ్చారు. అందుకే కొంత మందికి మళ్లీ ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదని సమర్థించే ప్రయత్నం చేశారు. వారు నిబంధనలు అతిక్రమించడం కాదు.. జగన్ రెడ్డి కుట్రల్లో భాగమయ్యారనేది టీడీపీ క్యాడర్ అవేదన. తప్పు జరగకపోయినా జరిగినట్లుగా కోర్టుల ముందే చెప్పే దౌర్భాగ్యం వచ్చింది. ఇప్పుడు అలాంటి వారికి మళ్లీ పోస్టింగులు ఎందుకన్నది చాలా మంది వాదన. ఈ విషయంలో చంద్రబాబుపై ఒత్తిడి ఉందన్నట్లుగా సమర్థించే ప్రయత్నం చేశారు.
అంతే కాదు.. కన్నుకు కన్ను.. పంటికి పన్ను అనే కాన్సెప్ట్ అమలు చేస్తే జగన్ రెడ్డికి .. చంద్రబాబుు తేడా ఏముంటుందని కూడా వాదించేస్తున్నారు ఆర్కే. అలా చేసినందుకే జగన్ ను అలా ఓడించారని.. టీడీపీ క్యాడర్ భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక కూడా అలా చేయకపోతే చేతకానివాళ్లని వైసీపీ నేతలే గెలిచేసే పరిస్థితులు ముందు ముందు ఉంటాయని మాత్రం ఆర్కే చెప్పలేదు.కొడాలి నాని నోరు వారానికే ఎందుకు బూతుల దారిలోకి వెళ్లిందో ఆర్కే కూడా చెప్పాల్సి ఉంది.
పాలన ఎలా ఉండాలి… ప్రజలకు ఎలా మేలు చేయాలో ఆర్కే చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. పైకి ఇలాంటి సలహాలిస్తున్నారంటే.. ఇక నేరగా ఎలాంటి సలహాలిస్తారో చెప్పాల్సిన పని లేదు. 2014-19 టైంలో… చంద్రబాబు నిర్ణయాలపై ఆర్కే ప్రభావం ఎక్కువగా ఉండేదని ముఖ్యంగా రాజకీయ నిర్ణయాల విషయంలో ఆయన సలహాలే పార్టీని దెబ్బకొట్టాయనన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆర్కేకు అంత చొరవ ఇవ్వకపోతే బాగుండనేది సగటు టీడీపీ కార్యకర్త అభిప్రాయం.