హరీష్ రావు బీజేపీలో చేరుతారన్న ప్రచారం కొంత కాలంగా జరుగుతోంది. దీని వెనుక ఉన్న కారణం ఈడీ అని తాజాగా వెలుగులోకి వస్తోంది. పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు దాడులు చేశారు. సోదాల్లో మూడు వందల కోట్ల లావాదేవీలను గుర్తించారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన డబ్బులను మైనింగ్ లో వచ్చినట్లుగా చూపించి.. దాన్ని లెక్కల్లేని రియల్ ఎస్టేట్లో పెట్టుబడులుగా పెట్టారు. ఈ గుట్టు అంతా బయటకు వచ్చేందుకు అవసరమైన పత్రాలన్నీ మహిపాల్ రెడ్డి ఇంట్లో దొరికాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ వ్యవహారాలన్నీ హరీష్ గుప్పిట్లో ఉంటాయి. ఎమ్మెల్యేలు కూడా హరీష్ కనుసైగలకు మేరకు పని చేస్తారు. ఈ క్రమంలో హరీష్ రావు కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు గూడెం మహిపాల్ రెడ్డి కూడా కొన్ని చక్కబెట్టినట్లుగా తెలుస్తోంది. మరో ఎమ్మెల్యే తో కూడా ఈ లింకులు ఉన్నాయి. మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకుంటోందని చెబుతున్నారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో సోదాలు చేసి మూడు వందల కోట్ల అక్రమాల గురించి చెప్పారు. కానీ ఇంకా బోలెడన్ని పత్రాలతో పాటు మరికొనని లాకర్లు తెరవాల్సి ఉందని హింట్ ఇచ్చారు. అంటే.. ఇంకా గుప్పిట పట్టేసినవి ఉన్నాయని ఈడీ చెప్పకనే చెప్పింది.
వచ్చే కొన్ని రోజుల్లో జరిగే రాజకీయ పరిణామాలను బట్టి తదుపరి చర్యలు ఉండే అవకాశం ఉంది. హరీష్ రావు పార్టీ మార్పుపై ఉద్దృతంగా ప్రచారం జరగడానికి ఇదే కారణమని చెబుతున్నారు. గతంలో కూడా హరీష్ బీజేపీలో చేరికపై ప్రచారాలు జరిగేవి. కానీ అవన్నీ.. .కేసీఆర్ దృష్టిలో ఆయన విలువను తగ్గించడానికి రాజకీయ వ్యూహంలో భాగంగా చేసేవి. ఓ సారి కేసీఆర్ కు కూడా అనుమానం వచ్చిందేమో కానీ చాలా కాలం దూరం పెట్టారు. ఇప్పుడు అధ్యక్ష పదవి ఇస్తానని లీకులు ఇస్తున్నారు. మొత్తంగా హరీష్ రావు చుట్టూ తెలంగాణలో తెలియని అంతర్గత రాజకీయం ఏదో జరుగుతోందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.