ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వర్కింగ్ ప్రెసిడెంట్లతో పెట్టుకున్న లొల్లి అంతకంతకూ పెరిగిపోతోంది. టిక్కెట్ల సమయంలో ఏర్పడిన వివాదం కాస్తా ఇప్పుడు ముదిరి పాకాన పడింది. చివరికి తాను తప్ప ఎవరూ కాంగ్రెస్ పదవుల్లో లేరని .. కార్యవర్గం మొత్తాన్ని రద్దు చేస్తున్నట్లుగా షర్మిల ఉత్తర్వులిచ్చేశారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా ఉండరన్నమాట.
సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి అనే వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెస్ కు ఉన్నారు. కానీ షర్మిల అంతా తానై వ్యవహరిస్తున్నారు. వారి మాటల్ని వినడం లేదు. దాంతో వారు ఈగో ఫీలయ్యారో… తాము ఎప్పట్నుంచో ఉన్నామని ఇప్పుడు వచ్చి షర్మిల పెత్తనం చేయడం ఏమిటని అనుకున్నారో కానీ షర్మిలపై ఆరోపణలు చేయడం ప్రారంభించారు. పార్టీ ఫండ్ నొక్కేసిందని కూడా ఆరోపించారు. దీంతో షర్మిల విజయవాడలోని పార్టీ కార్యాలయానికి తాళాలేయించారు. అన్ని పదవుల్ని రద్దు చేశారు.
దీంతో పాటు ఆ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇద్దర్నీ పార్టీ నుంచి బయటకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయించారు. ప్రస్తుతం షర్మిల చెప్పినట్లే ఏపీ కాంగ్రెస్ లో వ్యవహారాలు నడుస్తాయి. హైకమాండ్ మొత్తం ఆమె చేతుల్లోనే పెట్టింది. కాంగ్రెస్ లో పదవులు కావాలంటే షర్మిల చెప్పినట్లే చేయాల్సిందే కానీ… ఎదురుతిరిగితే పార్టీలో చోటుండదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకోకుండా సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి రాజకీయం చేస్తున్నారన్న విస్మయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది.