పులివెందుల వచ్చిన జగన్ రెడ్డిని చూసేందుకు జనాన్ని ఎవరూ సేకరించలేదు . కొంత మంది ద్వితీయ శ్రేణి నేతుల నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చారు. అయితే జగన్ రెడ్డి అందర్నీ కలిసేందుకు అంగీకరించలేదు. కొన్ని ప్రత్యేకమైన పారామీటర్స్ పెట్టుకుని ఎవరూ ప్రశ్నించరు.. కేవలం పరస్పర ఓదార్పు కోసం అన్నట్లుగా ఉండే వారిని మాత్రం కొన్ని ఫోటోల కోసం జగన్ రెడ్డికి వద్దకు పంపారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఖచ్చితంగా జగన్ రెడ్డిని కలవాలనుకునేవారు తోసుకున్నారు.
వీరి బాధ ఏమిటి అంటే… డబ్బులు. పనులు చేసిన వాటికి బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఓడిపోయారు. ఖచ్చితంగా గెలుస్తామని గెలిచాక ఇస్తామని చెప్పి అందర్నీ మభ్య పెట్టి బిల్లులు చెల్లించకుండా ఆపేశారు. ఫలితంగా వారంతా ఇప్పుడు కిందా మీదా పడుతున్నారు. అప్పులు చేసి పనులు చేశామని ఇప్పుడు బిల్లులు రాకపోతే ఆస్తులమ్ముకున్నా సరే తీరవని మథన పడుతున్నారు. ఆ పనులు బిల్లుల పత్రాలు పట్టుకుని జగన్ రెడ్డి ముందు క్యూ కడుతున్నారు.
శనివారం పులివెందుల నుంచి మాత్రమే జనం వచ్చారని.. ఈ రోజు , రేపు కడప జిల్లా వ్యాప్తంగా వైసీపీ ద్వితీయ శ్రేణి క్యాడర్అంతా.. తమకు రావాల్సిన బిల్లుల్ని చేత పట్టుకుని జగన్ రెడ్డిని అడగడానికి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వైసీపీ క్యాడర్ కు కడప జిల్లాలో రెండు , మూడువందల కోట్ల వరకూ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు.