దేశ వ్యాప్తంగా ‘కల్కి’ పేరు మార్మోగుతోంది. వరుస ఈవెంట్లతో ప్రమోషన్లతో స్పీడు పెంచింది చిత్రబృందం. మరో 4 రోజుల్లో ‘కల్కి’ దర్శనం కానుంది. ఈలోగా హైదరాబాద్ లో చిట్ట చివరి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించడానికి చిత్రబృందం సమాయాత్తం అవుతోంది. ఈ ఈవెంట్ కి ఎవర్ని పిలవాలి? ఎక్కడ నిర్వహించాలి? అనే విషయాలపై చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. ఇప్పటికే ‘బుజ్జి’ కోసం హైదరాబాద్ లో ఓ ఈవెంట్ నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మరో మెగా ఈవెంట్ తో ప్రచారానికి పుల్ స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. మీడియా ఇంటర్వ్యూలు, Q and A సెషన్లకు చిత్రబృందం ఛాన్స్ ఇవ్వడం లేదు. సినిమా విడుదలైన తరవాతే ఇంటర్వ్యూల హంగామా ఉంటుంందని టాక్.
27న ‘కల్కి’ విడుదల. అంతకు ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయేమో అని అభిమానులు ఆశించారు. ఏపీలో ప్రభుత్వం మారింది కాబట్టి అర్థరాత్రి ఒంటి గంట షో గ్యారెంటీ అనుకొన్నారు. అయితే చిత్రబృందం అందుకు ఆసక్తి చూపించడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఉదయం 5 గంటల షోలతోనే ‘కల్కి’ ప్రయాణం ఆరంభం కానుంది. ఎక్కడా అర్థరాత్రి షోలు లేవు. ఏపీ, తెలంగాణలలో 5 ఆటలకు ముందు నుంచే అనుమతి ఉంది. ఆ ప్రకారమే ‘కల్కి’ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో కల్కి టికెట్లు అమ్ముడైపోయాయి. తొలి మూడు రోజుల్లో పాత రికార్డులన్నీ ‘కల్కి’ బద్దలు కొట్టడం ఖాయమని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవర్సీస్లో కూడా ‘కల్కి’ తన స్టామినా చూపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.