చిరంజీవికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ దక్కితే.. కనీసం ఇండస్ట్రీ తరపున ఒక్క ఈవెంట్ కూడా నిర్వహించలేదు. ఆఖరికి ‘మా’ కూడా ఈ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఇది ముమ్మాటికీ చిత్రసీమ నిర్లక్ష్యం, చేతకాని తనం, వైఫల్యం. పద్మవిభూషణ్ అనే పురస్కారానికి ఉన్న గౌరవం, ‘మా’ పెద్దలకు ముఖ్యంగా మంచు విష్ణుకు తెలియకపోవడం దురదృష్టకరం.
ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా. ఆయన చేతిలో పలు శాఖలు ఉన్నాయి. అసెంబ్లీలో చిత్రసీమ గురించి గట్టిగా మాట్లాడగలిగే సత్తా, స్థాయి ఉన్న వ్యక్తి. జగన్ రెడ్డి హయాంలో చిత్రసీమకు ఏపీ నుంచి రావాల్సిన గౌరవం కానీ, రాయితీలు కానీ, ప్రోత్సాహం కానీ దక్కలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ ఏపీపై ఆశలు పెట్టుకొంది. ఇలాంటి సమయంలో కనీసం పవన్ కల్యాణ్‌ని అయినా గౌరవించుకోవడం చిత్రసీమ కనీస ధర్మం. పార్టీ పెట్టి, పదేళ్లు పోరాడి, ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పవన్… చిత్రసీమ వ్యక్తి కావడం అందరూ గర్వించదగిన విషయమే కదా? సినిమా వాళ్లు రాజకీయాలకు పనికి రారు అనే మాటని మరోసారి.. పవన్ చెరిపివేశాడు కదా? పార్లమెంట్ సాక్షిగా, ప్రధాని మోదీతో ‘తుఫాన్’ అని పిలిపించుకొన్న పవన్ స్టామినా గురించి మళ్లీ మళ్లీ.. టాలీవుడ్ కు ప్రత్యేకంగా చెప్పాలా? కనీసం ఈ కారణంతోనైనా పవన్‌ని గౌరవించుకోవాలి. నిజానికి పవన్‌కు ఇలాంటి సత్కారాలు, సన్మానాలు అస్సలు ఇష్టం ఉండవు. కానీ… ఆయన్ని గౌరవించుకోవడం ఇండస్ట్రీ బాధ్యత. దాన్ని మాత్రం విస్మరించకూడదు. చిరంజీవి విషయంలో చేసిన తప్పు, పవన్ విషయంలో చేయదనే అందరి నమ్మకం. ఈసారీ అదే తప్పు జరిగితే.. ఇక చేసేదేం లేదు.