మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ మెగా డీఎస్సీ ఫైల్ పైనే తొలి సంతకం చేశారు. అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తామని చంద్రబాబు ప్రకటించినట్లుగానే 16,347పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టగా… ఆ ఫైల్ పైనే సంబంధిత శాఖ మంత్రిగా లోకేష్ సంతకం చేశారు. ఈ దస్త్రంపై నేడు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలపనున్నారు.
కేబినెట్ ఆమోదముద్ర అనంతరం డీఎస్సీ నిర్వహణకు మార్గం సుగమం కానుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఈ 16 వేల ఉపాధ్యాయ పోస్టులను ఆరు నెలల్లోపు ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. మొదట ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ )ను నిర్వహించి, అనంతరం డీఎస్సీని నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోన్న ప్రభుత్వం డిసెంబర్ 10లోపు ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక, సోమవారం ఉదయం నారా లోకేష్ విద్య, ఐటీ, ఆర్టీజీ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సచివాలయంలోకి అడుగు పెట్టిన లోకేష్ 4వ బ్లాక్ రూమ్ నెంబర్ 208లో బాధ్యతలు స్వీకరించారు. అంతరం మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేసి… నిరుద్యోగుల్లో కూటమి సర్కార్ పట్ల మరింత విశ్వాసం పెంచారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ తన చాంబర్ లో హంగు, ఆర్భాటాలను తిరస్కరించారు. చాంబర్ లో తనకు ప్రత్యేక సదుపాయాలు వద్దని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కుర్చీకి ప్రత్యేకంగా టవల్ చుట్టి ఉండటాన్ని గమనించిన లోకేష్ దాని తీసివేసి తన సింపుల్ సిటీని చాటుకున్నారు.