బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా జులై 1న ప్రారంభం కాబోతోంది. ఈ చిత్రంతో లుధీర్ బైరెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. చందూ మహేష్, సాయి శశాంక్ నిర్మాతలు. ఈ చిత్రం కోసం మూడు పవర్ఫుల్ టైటిల్స్ పరిశీలలో ఉన్నాయి. ‘వామన’, ‘ఉద్భవ’, ‘హైందవ’ అనే టైటిళ్లు పరిశీలిస్తున్నారు. శ్రీనివాస్ అయితే ‘హైందవ’ వైపే మొగ్గు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే…. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా టైటిల్ ని కూడా అధికారికంగా ప్రకటిస్తారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రమిది. బెల్లంకొండకు ఇప్పుడున్న మార్కెట్ దృష్ట్యా రూ.50 కోట్లు రిస్కే. కానీ… కథపై నమ్మకంతో నిర్మాతలు ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి ముందుకొస్తున్నారు. సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది.
బెల్లంకొండ హీరోగా ‘టైసన్ నాయుడు’ అనే చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. చిత్రీకరణ తుది దశకు చేరుకొంది. మరోవైపు ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ దర్శకత్వంలో కూడా బెల్లంకొండ ఓ సినిమా చేయడానికి ఒప్పుకొన్నాడు. దీని కోసం ‘కిష్కందపురి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ రెండు సినిమాల్నీ సమాంతరంగా ఒకేసారి పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ.