విజయశాంతి అనగానే కర్తవ్యం, కర్తవ్యం అనగానే పోలీస్ కథలు గుర్తుకు రావడం సహజం. విజయశాంతిని కాస్త లేడీ సూపర్ స్టార్ గా మార్చిన సినిమా అది. హీరోయిన్లు పోలీస్ పాత్రల్లో అదరగొడతారని, హీరోయిజం చూపిస్తారని చాటి చెప్పిన సినిమా అది. ఇప్పుడు మళ్లీ విజయశాంతి ఆ ‘కర్తవ్యం’ నాటి రోజుల్ని గుర్తుకు తెస్తున్నారు. విజయశాంతి ప్రధాన పాత్రలో కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకుడు. కల్యాణ్ రామ్ నటిస్తున్న 21వ చిత్రమిది.
ఈరోజు విజయశాంతి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని విజయశాంతి పాత్రని పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ని వదిలారు. వైజయంతీ ఐపీఎస్ గా విజయశాంతి పాత్రని పవర్‌ఫుల్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. ”తను పట్టుకొంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకొంటే యూనిఫామ్‌కి పౌరుషం వస్తుంది. తను ఒక యుద్ధం.. నేను తన సైన్యం” అంటూ కల్యాణ్ రామ్ వాయిస్ ఓవర్లో… వైజయంతీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కథలో కల్యాణ్ రామ్ విజయశాంతి తమ్ముడిగా నటిస్తున్నట్టు టాక్. త్వరలోనే కల్యాణ్ రామ్ పాత్రనీ పరిచయం చేస్తారని, అప్పుడే టైటిల్ ని కూడా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.