ఆస్ట్రేలియా భారత్ పాలిట కొరుకుడు పడని కొయ్య లాంటి జట్టే. ఐసీసీ టోర్నీలలో చాలాసార్లు ఆసీస్ చేతిలో భారత్ కు భంగపాటు ఎదురైంది. ముఖ్యంగా గత వరల్డ్ కప్ లో ఫైనల్లో ఓడించి, కోట్లాదిమంది భారతీయుల కలల్ని, ఆశల్నీ ఛిద్రం చేసింది. ఇప్పుడు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకొనే అవకాశం భారత్ ముందు ఉంది. టీ 20 వరల్డ్ కప్ రూపంలో.
టీ 20 టోర్నీ ప్రస్తుతం సూపర్ 8 దశలో ఉంది. గ్రూప్ బి నుంచి సెమీ ఫైనల్ బెర్తులు ఖాయమయ్యాయి. గ్రూప్ ఏ నుంచి భారత్ దాదాపుగా సెమీస్‌లో అడుగుపెట్టినట్టే. ఇప్పుడు రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, ఆఘ్గనిస్థాన్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ఆసీస్‌ని మట్టికరిపించడం వల్ల ఆఘ్గాన్ సెమీస్‌పై ఆశల్ని సజీవంగా ఉంచుకొంది. ఈరోజు భారత్ – ఆస్ట్రేలియా మధ్య సూపర్ 8 మ్యాచ్ జరగబోతోంది. ఇందులో భారత్ గెలిస్తే నేరుగా సెమీస్‌లో అడుగు పెడుతుంది. ఆసీస్ ఇంటిదారి పడుతుంది. కాబట్టి… ఆసీస్‌ని టోర్నీలోనే లేకుండా చేయడానికి భారత జట్టు తన శక్తివంచన లేకుండా పోరాడుతుందనడంలో సందేహం లేదు. పైగా మెన్ ఇన్ బ్లూ మంచి ఫామ్ లో ఉంది. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లూ గెలిచి, విజయ యాత్ర కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడిపోయినా భారత్ కు పెద్ద ఇబ్బందేం లేదు. కానీ ఆస్ట్రేలియా ఓడితే మాత్రం సెమీస్ తలుపులు దాదాపుగా మూసుకొంటాయి. కాబట్టి ఆసీస్‌కు ఇది చావో – రేవో అనుకొనే మ్యాచ్. పైగా పసికూనలైన ఆఘ్గాన్లపై ఓడిపోవడం ఆ జట్టుని మానసికంగా బలహీన పరుస్తుంది. కాకపోతే.. ఆసీస్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా రాణించి, కప్పు కొట్టగల సత్తా ఉంది. ఫైనల్లో ఆసీస్ మనకు ఎదురు కాకూడదు అనుకొంటే.. సూపర్ 8 దశలోనే ఆస్ట్రేలియాను ఇంటికి పంపేయడం ఉత్తమమైన మార్గం. మరి రోహిత్ సేన ఏం చేస్తుందో చూడాలి. ఈరోజు రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.