కథా స్రవంతిలో మరో వారం గడిచింది. ఈసారి కూడా వైవిధ్యమైన ఇతివృత్తాలతోనే కథలొచ్చాయి. రకరకాల సమస్యల్ని తమదైన కోణంలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు కథకులు. వాటి విశ్లేషణ. క్లుప్తంగా.. మీ కోసం!
కథ: కథలో రాయని పాత్ర
రచన: గజ్జెల దుర్గారావు
పత్రిక: ఈనాడు
విజేత ఒక్కడే తయారు కాలేడు. ఆ ప్రయాణం వెనుక కొందరి తోడ్పాటు, ఇంకొందరి త్యాగాలు ఉంటాయి. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పడం ధర్మం. అయితే ఒక్కోసారి చెప్పలేని, చెప్పుకోలేని పాత్రలు కూడా ఉంటాయి. ఆ నేపథ్యంలో సాగే కథే.. ‘కథలో రాయని పాత్ర’. జీవితంలో సముచిత స్థానం సంపాదించిన ఓ విజేత కథ ఇది. తన ప్రయాణంలో ఎదురైన వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం ఓసారి వస్తుంది. అయితే ఓ వ్యక్తి గురించి మాత్రం గోప్యత పాటిస్తాడు. అదెందుకు? అనేదే కథ. మన చుట్టూ నెగిటివిటీ పెరిగిపోతోంది. అయితే ఈ కథలో మాత్రం చాలా పాజిటీవ్ పాత్రలు కనిపిస్తాయి. మన చుట్టూ ఇంత మంచి వాళ్లుంటే ఎంత బాగుంటుందో అనిపించే కథ ఇది.
కథ: ఆ ముగ్గురు… ఓ ఉత్తరం
రచన: పి.వి.ఆర్.శివకుమార్
పత్రిక: సాక్షి
కళ్లతో చూసిందంతా నిజం కాదు. కనిపించనిదంతా అబద్ధమూ కాదు. ఒకరి దృష్టిలో తప్పు, మరొకరి కోణంలో ఒప్పుగా కనిపించొచ్చు. తప్పొప్పుల్ని నిర్ణయించేవి కేవలం పరిస్థితులే తప్ప, మనుషులు కారు. ఈ కథ చదివినా అదే అనిపిస్తుంది. సుమిత్ర, వాసుకి, ధన్వంతరి అనే ముగ్గురి కోణంలో సాగే కథ ఇది. అన్నీ ఉత్తరాల రూపంలో సాగే స్వగతాలే. వాళ్ల వాళ్ల జీవితంలో, వాళ్లకు ఎదురైన అనుభవాలు, తీసుకొన్న నిర్ణయాలు.. వెరసి ఈ కథ. ఓ తండ్రి తీసుకొన్న నిర్ణయం బిడ్డని ఎంత క్షోభకు గురి చేసింది? అసలు ఆ తండ్రి ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏమిటి? అనేదే క్లుప్తంగా కథ. ఈ కథని ఫస్ట్ పర్సన్లోనో, థర్డ్ పర్సన్లోనో చెప్పొచ్చు. అలాగైతే రొటీన్ స్టోరీ అయ్యేది. ఉత్తరాల నేపథ్యంలో, ఒకే విషయాన్ని మూడు కోణాల్లో చెప్పడం వల్ల కొత్తదనం అబ్బింది.
కథ: కెరటం
రచన: కడెం లక్ష్మీ ప్రశాంతి
పత్రిక: నమస్తే తెలంగాణ
అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఆ తరవాత ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో సాగే కథ ఇది. కథ చదువుతున్నప్పుడు ‘నిర్భయ’లాంటి విషాద గాథలు కళ్ల ముందు మెదులుతాయి. అయితే… జరిగిన దానికి కృంగిపోకుండా, జీవితాన్ని ఆశావాహ దృక్పథంతో తిరిగి ప్రారంభించడం అనే అంశం బాగుంది. కడలి జీవితాన్ని ఛిద్రం చేసినవాళ్లకంటే, ఆమెను మధ్యలోనే వదిలి వెళ్లిపోయిన వరుణ్‌పై ఎక్కువ కోపం వేస్తుంది. ప్రధాన పాత్రకు ‘కడలి’ అనే పేరు పెట్టడం నచ్చింది. పడినా మళ్లీ లేవడం కెరటానికి అలవాటు. అలాంటి కెరటాలెన్నింటినో పుట్టించిన కడలి.. మళ్లీ తన పొంగిపొర్లడం ఆశ్చర్యమనిపించదు.
కథ: ఫోబియా
రచన: కారంపూడి వెంకట రామదాస్
పత్రిక: వెలుగు
చిన్న చిన్న విషయాలకు భయపడిపోయి నానా హైరానాకు గురయ్యేవాళ్లకు ఓ గుణపాఠం ‘ఫోబియా’. పక్కింటి గోవిందం తుమ్మాడని… అదేం వైరస్సో అని తాను కంగారు పడి, ఇంటిల్లి పాదినీ పరుగులు పెట్టించిన బాచీ అనే భయస్థుడి కథ ఇది. కథనం సరదాగా సాగింది. చివర్లో ఇచ్చిన సందేశం కూడా ఆకట్టుకొనేదే. కరోనా తరవాత ఆరోగ్యపరమైన అనుమానాలు, భయాలూ ఉండాల్సిందే. కానీ చాదస్తం మాత్రం పనికిరాదని హెచ్చరించారు ఈ కథతో.
కథ: పెద్ద దిక్కు
రచన: కొట్టం రామకృష్ణారెడ్డి
పత్రిక: ఆంధ్రజ్యోతి
కథ, అది సాగిన విధానం ఎలా ఉన్నా.. ఆ మాండలికం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ‘పెద్ద దిక్కు’ కథలో. తెలంగాయ యాస, భాష, ఆ హొయలు… పొంగి పొర్లాయి. కొన్ని చోట్ల ఆగి, మళ్లీ వెనక్కి వెళ్లి, ఆ పద సౌందర్యాన్ని మరోసారి నెమరు వేసుకొంటాం. తెలంగాణ మాండలికంపై ప్రేమ, ఇష్టం, అవగాహన ఉన్నవాళ్లు ఈ పద సౌరభాల్ని బాగా ఆస్వాదిస్తారు. లేదంటే.. ఆ భాషని, యాసని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం.
– అన్వర్