ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత భేటీ అయిన తొలి మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక సంతకం చేసిన ఐదు అంశాలపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. మెగా డీఎస్సీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ, నైపుణ్య గణనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మెగా డీఎస్సీ విషయంలో ఆలస్యం చేయవద్దని ఈమేరకు జులై 1నుంచి ఈ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 10కల్లా ముగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో పాటు పెన్షన్ల పెంపుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పేదల ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. నిరుద్యోగుల్లోని ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించేలా నైపుణ్య గణనకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
అయితే, గత ప్రభుత్వ హాయాంలో చేపట్టినట్టుగానే ఇంటింటికీ ఫించన్ పంపిణీ చేపట్టాలని నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం.. వాలంటీర్లు వైసీపీ మద్దతుదారులుగా ఉండటంతో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. జులై 1 నుంచి పెన్షన్ పంపిణీని ఓ ఉత్సవంలా జరపనున్నారు. విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరును తిరిగి ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీగా మార్చాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్.
వైసీపీ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై సమీక్ష చేయలని నిర్ణయించారు. అన్ని శాఖలను వైసీపీ నిర్వీర్యం చేసిందని ముఖ్యంగా ఫైనాన్స్ ,ఎక్సైజ్ , మైనింగ్, విద్యుత్ శాఖలతో పాటు పోలవరం, అమరావతిలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలని మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది.