తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారులు ఎప్పుడూ హైలెట్ అవుతూనే ఉన్నారు. గత ప్రభుత్వంలో స్మితా సభర్వాల్ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో ఎంత పలుకుబడి కలిగిన ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్నారో చెప్పాల్సిన అవసరం లేదు . ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ ప్రాధాన్యత కాట అమ్రపాలిరెడ్డికి దక్కుతోంది. కాంగ్రెస్ గెలిచినప్పుడు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆమె.. రేవంత్ సీఎం కాగానే తెలంగాణకు వచ్చేశారు. వచ్చినప్పటి నుండి ఆమె కీలకమైన పోస్టులు పొందుతూనే ఉన్నారు.
తాజాగా జరిగిన బదిలీల్లో గ్రేటర్ కమిషనర్ పోస్టు కూడా ఆమెకే దక్కింది. అంతకు ముందే నాలుగు కీలకమైన బాధ్యతల్లో ఉన్నారు. వాటి నుంచి తప్పించలేదు సరి కదా.. మరింత కీలకమైన పోస్టు ఇచ్చారు. 2010 బ్యాచ్‌కు చెందిన ఆఫీసర్ అమ్రపాలికి ఇంత ప్రాధాన్యం ఇవ్వడం సీనియర్ అధికారుల్లోనూ అసంతృప్తికి కారణం అవుతుంది. అయితే ఎవరికీ నోరు మెదిపే ధైర్యం లేదు. సాధ్యమైతే సీఎంన కాకాపట్టి మెరుగైన పోస్టింగ్ తెచ్చుకోవడమే.
కాట అమ్రపాలి మొదట బీఆర్ఎస్ సర్కార్ లో కీలకంగా వ్యవహరించారు. జిల్లాల విభజన తర్వాత వరంగల్ కలెక్టర్ గా చాన్సిచ్చారు. కానీ ఓ సందర్భంలో కేటీఆర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్నుంచి గ్యాప్ పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో అదనపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా పని చేశారు. బీఆర్ఎస్ గెలవడంతో ఇక సరైన పోస్టింగ్ ఉండదని.. ఢిల్లీకి వెళ్లిపోయారు. మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర సెక్రటరీగా.. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో పని చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో ఆమె పవర్ పుల్ ఆఫీసర్.