అనర్హత వేటు వేయిస్తామని బెదిరించి ఎమ్మెల్యేలను ఆపేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఇందు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లబోతున్నామని మీడియాకు లీకులిచ్చింది. ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు అదే దారిలో ఉన్నారని తెలియడంతో ఈ తరహా ప్రయత్నాలు చేస్తోంది. బుజ్జగింపులకూ ఎవరూ లొంగడం లేదు. స్పీకర్ అనర్హతా వేటు వేయకపోయినా కోర్టు ద్వారా వేయిస్తామని బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇందుకు మహారాష్ట్ర విషయంలో సుప్రీంకోర్టు పెట్టిన మూడు నెలల గడువును చూపిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో అయినా.. మరో చోట అయినా సుప్రీంకోర్టు.. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోలేదు. సూచించగలదు కానీ ఆదేశించలేదు. మహారాష్ట్రలో కూడా సుప్రీంకోర్టు ఎన్నో సార్లు సూచించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నారు. కానీ అది పార్టీ ఫిరాయింపుల వ్యవహారం కాదు.. పార్టీ చీలిక వ్యవహారం.
ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఎవరైనా పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హతా వేటు వేయవచ్చు. కానీ అది వందశాతం స్పీకర్ కు ఉన్న అధికారం. కోర్టులు కూడా జోక్యం చేసుకోలేవు. ఫలానా సమయం లోపు నిర్ణయం తీసుకోవాలన్న రూల్ కూడా లేదు. అందుకే అధికారంలో ఉన్న వారికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఓ ఆయుధంగా కనిపిస్తోంది.గతంలో బీఆర్ఎస్ వాడుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాడుతోంది.
ఈ బెదిరింపులతో ఎమ్మెల్యేల్ని ఆపగలరని అనుకోవడం అమాయకత్వమే. అయితే బీఆర్ఎస్ నేతలు తమ ప్రయత్నాలు మాత్రం తాము చేస్తున్నారని అనుకోవచ్చు.