‘వై నాట్ 175’ అంటూ బీరాలు పలికిన వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవ్వగా..తాజాగా కుప్పంలో వైసీపీ కూసాలు కదులుతున్నాయి. చంద్రబాబు ఇలాకాలో పాగా వేస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీకి అక్కడ అడ్రస్ గల్లంతు కాబోతోంది. మంగళ, బుధవారాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన నేపథ్యంలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతోంది.
వైసీపీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, కీలక నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు సిద్దం అయ్యారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో మున్సిపాల్టీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ ఎక్కువ శాతం గెలుపొందటంతో కుప్పంలో చంద్రబాబును సైతం ఓడగొడుతామని తొడకొట్టారు వైసీపీ నేతలు. కట్ చేస్తే ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో గతంలో ఆ పార్టీలో చేరిన నేతలంతా తిరిగి సైకిల్ ఎక్కేందుకు రెడీ అయ్యారు.
కుప్పం నియోజకవర్గంలోని వైసీపీ నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సన్నాహాలు పూర్తయ్యాయి. కుప్పంలో టీడీపీని ఖాళీ చేస్తామన్న వైసీపీ నేతల సవాల్ కు చెక్ పెడుతూ నియోజకవర్గంలో వైసీపీని ఖాళీ చేస్తున్నారు టీడీపీ నేతలు.