వైసీపీ శాసనసభా పక్షం ఈ సారి వ్యూహం మార్చిందన్నారు మంచిదే. అయితే అత్యధిక సమయం నాయకుడైన జగన్ తీసుకోవడం తప్ప అందరికీ భాగం కల్పించే పద్ధతి మాత్రం ఇంకా రాలేదు. ప్రస్తుత శాసనసభా సమావేశాల్లోనూ పదేపదే ఆయనే మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష నేత లేచినిలబడితే సమయం ఇస్తారన్నది నిజమే గాని కీలక ప్రసంగాలు చేసేందుకు ఇతరులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా? జ్యోతుల నెహ్రూ, శ్రీకాంత్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, అలాగే కొందరు మహిళలు బాగానే మాట్లాడగలరు. కొత్తవాళ్లు నేర్చుకుంటారు. అంతేగాని ప్రతిసారీ తనే సమయం తీసుకుంటే కొత్తగా వినిపించదు కూడా. జగన్ ప్రసంగాలకు సహకరించే బాధ్యత తీసుకున్న వారు బాగానే కష్టపడొచ్చు గాని ఆయన మాటల్లో రిపిటీషన్ చాలా ఎక్కువగా వుంటున్నది. పశ్చిమ దేశాల్లో వుండే రిటారిక్ స్టైల్‌ను జగన్ ఎక్కువగా అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. జూలియస్ సీజర్‌ను హత్యానంతరం ఆ కుట్ర దారులను ఎండగట్టడం కోసం ఆంటోనీ.. ఆ సీజర్, అలాటి సీజర్ అంటూ పదే పదే సీజర్ పేరు ప్రస్తావిస్తూ మాట్లాడతారు. ఐ హావ్ ఎ డ్రీం అంటూ మార్టిన్ లూధర్ కింగ్ ప్రసిద్ధ ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ కూడా ఆ శైలిలోనే పాండవులు, అలాటి పాండవులు ఇలాటి పాండవులు అంటూ పదే పదే ప్రస్తావిస్తూ డైలాగులు చెబుతారు. ఎవ్వని చే జనించు జగమెవ్వరి లోపల నుండు.. అనే ప్రార్థనా పద్యంలోనూ ఎవ్వరు అనేది పదే పదే వస్తుంది. కాని ఈ నాటి తెలుగులో ఒక పదం రెండు సార్లు వస్తేనే కాస్త ఇబ్బందిగా వుంటుంది. అలాటిది జగన్ పదే పదే అదే చంద్రబాబు నాయుడు గారు అంటూ పేరు పలకడానికే బోలెడు సమయం పోగొట్టుకోవడం అవసరమా? రిటారిక్ శైలికి పరిమితులున్నాయని తెలుసుకుంటే రిపిటీషన్ నివారించవచ్చు. కొత్తపాయింట్లు వుంటే చెప్పొచ్చు. మరొకరు మాట్లాడొచ్చు.