మహారాష్ట్రలో భాజపాకి మిత్రపక్షంగా, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న శివసేన పార్టీ వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టింది.
ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో “ఇదివరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం విజయ్ మాల్య వేలకోట్లు దక్కేందుకు సహకరిస్తే, అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు అతను దేశం విడిచిపెట్టి పారిపోవడానికి సహకరించింది. కనుక అతనిని తిరిగి దేశానికి రప్పించే బాధ్యత కూడా మోడీ ప్రభుత్వమే తీసుకోవాలి. అతను దేశం విడిచిపెట్టి పారిపోయాడని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పగలడు కానీ ఆ సంగతి మోడీ ప్రభుత్వానికి తెలియదంటే నమ్మలేము. విజయ్ మాల్యా తెల్లకోటు ధరించి తిరిగే ఒక ఆర్ధిక ఉగ్రవాది. అతని పట్ల కటినంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాలు సహకరిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.అతన్బి విషయంలో మోడీ ప్రభుత్వం తీరు సరయింది కాదు. అతని విషయంలో ఇన్ని విమర్శలు చెలరేగుతున్న కనీసం స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అతనిని తక్షణమే భారత్ కి తిరిగి రప్పించి బ్యాంకుల వద్ద నుండి తీసుకొన్న రుణాలను అన్నిటినీ అతని నుండి వసూలు చేయాలి,” అని వ్రాసింది.
నరేంద్ర మోడీ ఎన్నికల సమయంలో తను అధికారంలోకి వచ్చినట్లయితే విదేశాలలో ఉన్న నల్లదనాన్ని అంతా వెనక్కి రప్పిస్తానని గొప్పలు చెప్పుకొన్నారు. సుమారు రెండేళ్ళవుతున్నా ఇంతవరకు ఆ పని చేయలేకపోయారు కానీ స్వదేశంలో బ్యాంకులను దోచుకొన్న విజయ్ మాల్యా వంటి ఆర్ధిక ఉగ్రవాదులను భద్రంగా దేశం దాటిపోవడానికి సహకరించడం విస్మయం కలిగిస్తోంది. విదేశాలలో ఉన్న నల్ల ధనాన్ని తేలేకపోయినా కనీసం దేశాన్ని దోచుకొంటున్న ఇటువంటి దొంగలను పట్టుకొన్నా చాలు.