‘కల్కి’ విడుదలకు రంగం సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగులతో ఇప్పటికే హోరెత్తిపోతోంది. రేపు ఒక్క రోజే దాదాపు రూ.250 కోట్లు రాబట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు లెక్క గడుతున్నాయి. ఒక్క నైజాంలోనే రూ.35 కోట్లు వసూలు చేసే ఛాన్స్ ఉంది. ఓవర్సీస్లో అయితే ‘కల్కి’ మరింత జోరు చూపిస్తోంది. నార్త్ అమెరికా, ఆస్ట్రేలియాలాంటి చోట్ల కనీవినీ ఎరుగని స్థాయిలో టికెట్లు తెగాయి. ‘కల్కి’ ఏమాత్రం నిలబడినా ‘బాహుబలి 2’ రికార్డులు గల్లంతవ్వడం ఖాయమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇప్పటి వరకూ ఇండియన్ బాక్సాఫీసు ముందు రికార్డుల రారాజుగా మన్ననలు అందుకొంటోంది ‘బాహుబలి 2’. రాజమౌళి నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ వచ్చినా… ‘బాహుబలి 2’ రికార్డులు చెక్కు చెదరలేదు. ‘సలార్’ కూడా తొలి రోజు వసూళ్లలో నాన్ బాహుబలి రికార్డులు మాత్రమే బద్దలు కొట్టింది. ‘కల్కి’ మాత్రం ‘బాహుబలి 2’ రికార్డులు చెరిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్ లో ఆల్ టైమ్ రికార్డుకు చేరువ అవుతుందా, లేదా? అనేది మాత్రం ‘కల్కి’ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ‘బాహుబలి 2’లో బాలీవుడ్ నటీనటులెవరూ లేరు. అయినా సరే, హిందీనాట వసూళ్ల వర్షం కురిపించారు. ‘కల్కి’ అడ్వాంటేజ్ ఏమిటంటే.. ఈసారి అమితాబ్ బచ్చన్, దీపికాపదుకొణే లాంటి బాలీవుడ్ స్టార్లు తోడయ్యారు. కమల్ కు సైతం బాలీవుడ్ లో అభిమానులు ఉన్నారు. వాళ్లు ఈ సినిమా హిందీ సినిమా స్వీకరిస్తే… ‘కల్కి’ వసూళ్లకు అడ్డు గోడలు లేనట్టే. పైగా ‘కల్కి’ సైన్స్ ఫిక్షన్. పిల్లలకు నచ్చే అంశాలు సైతం ఈ కథలో చాలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బుజ్జి స్పెషల్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలవబోతోంది. ఇవన్నీ కుటుంబ సమేతంగా జనాల్ని థియేటర్లకు రప్పించే ఎలిమెంట్స్. కాబట్టి.. ‘బాహుబలి 2’ రికార్డులు చెరిపివేసే సత్తా ‘కల్కి’కి ఉందని అందరి నమ్మకం.