రైతులను ఆదుకోవాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన రైతుబంధు పథకం ఎంతో మంది అనర్హులకు వెళ్తుంది అనేది ముందు నుండి ఉన్న విమర్శే. కౌలు రైతులను కాదని, సాగుకు పనికి వస్తుందా లేదా అని చూడకుండా కేసీఆర్ సర్కార్ రైతుబంధు పథకం అమలు చేసింది.
వందల ఏకరాలున్న కోటీశ్వరులు, ఇతర పనుల కోసం సేకరించిన భూములకు, ఆన్ పేపర్ లో సాగు భూమిగా ఉన్న ప్లాట్లకు కూడా రైతుబంధు వచ్చింది.
అయితే, దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసింది. ఐదు ఎకరాల రైతుల వరకే అది కూడా సాగు అవుతున్న భూములకే ఇవ్వాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చింది. అయితే, ఐదు ఎకరాల వరకే సీలింగ్ పెట్టాలా పది ఎకరాల వరకు అమలు చేయాలా అన్న అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోపు నిజంగా సాగయ్యే భూముల సంఖ్య ఎంత అనేది తేల్చబోతున్నారు. కేవలం సాగు భూమికే రైతుబంధు ఇవ్వాలని ఫిక్స్ కావటంతో… సాగుభూమిని తేల్చేందుకు సర్వే చేయబోతున్నారు.
వ్యవసాయశాఖ, రెవెన్యూశాఖ కలిసి నిజంగా సాగు అవుతున్న భూమి సర్వే నెంబర్లు ఏవీ, ఒక పాస్ బుక్ లో ఎంత భూమి సర్వే అవుతుంది అన్న అంశాలపై సమగ్రంగా ప్రభుత్వానికి నివేదిక పంపబోతున్నారు.
ఈ సర్వే పూర్తయ్యాకే వచ్చే యాసంగి పంట నుండి పెంచిన రైతుబంధును ఇవ్వటంతో పాటు సీలింగ్ వరకే భరోసా కల్పించబోతున్నారు.