రాజకీయాల్లో అలకలు సర్వ సాధారణం. ఎన్నికల సమయంలోనో , పార్టీలో చేరికల సమయంలోనో ఎవరో ఒకరు అలకబూనడం రొటీన్ గా జరిగే తంతే. అయితే, కొన్నిసార్లు ఈ అలక నేతల రాజకీయ భవితవ్యాన్ని దెబ్బతీస్తుంది. మరికొన్నిసార్లు పదవీ కాంక్షను నేరవేర్చుతుంది. తాజాగా మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విషయంలోనూ ఇదే జరగబోతుందన్న టాక్ వినిపిస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికను వ్యతిరేకిస్తూ జీవన్ రెడ్డి అలకబూనిన సంగతి తెలిసిందే. జగిత్యాలలో జీవన్ రెడ్డిపై గెలుపొందిన సంజయ్ ను తనతో చర్చించుకుందానే పార్టీలో చేర్చుకోవడంపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి, అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీ పెద్దల ఆదేశాలతో జీవన్ రెడ్డికి నచ్చజెప్పేందుకు పార్టీ ప్రతినిధులు ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబులు జీవన్ రెడ్డిని కలిసి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సూచించగా.. తాను నిర్ణయం తీసుకున్నానని , పదవికి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి స్పష్టం చేయడంతో నేరుగా ఢిల్లీ పెద్దలే రంగంలోకి దిగారు.
వెంటనే జీవన్ రెడ్డిని ఢిల్లీకి తీసుకొనిరావాలంటూ కబురు పంపారు. ఈ బాధ్యతను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు అప్పగించిన అధిష్టానం.. జీవన్ రెడ్డికి ఎలాంటి హామీ ఇచ్చి నచ్చజెప్తుంది..? అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణపై పార్టీపెద్దలతో రేవంత్ చర్చిస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే జీవన్ రెడ్డిని గౌరవిస్తూ ఆయనను కేబినెట్ లోకి తీసుకుంటారా..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.