వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. హత్యాయత్నం, ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ముందుగా ఆయన్ను నరసారావుపేట ఎస్పీ ఆఫీసుకు తరలించి అక్కడి నుంచి ఆయనను మాచర్ల కోర్టుకు తరలించే అవకాశం ఉంది. నాలుగు కేసుల్లో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తాజాగా కొట్టివేయడంతో కాసేపటి క్రితమే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు .
అంతకుముందు.. తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. కానీ ముందస్తు బెయిల్ కు న్యాయస్థానం నిరాకరించింది. పిన్నెల్లిపై నమోదైన కేసుల తీవ్రత దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయడం, టీడీపీ ఏజెంట్లపై దాడికి పాల్పడటంతో పిన్నెల్లిపై కేసులు నమోదు అయ్యాయి. దీంతో తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అప్పట్లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా.. ఓట్ల లెక్కింపు వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది, ఆ తర్వాత దాని పొడిగించింది.
తాజాగా ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పిన్నెల్లి ఇంకా బయట ఉంటే సాక్షులను భయపెట్టి, ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనతో హైకోర్టు ఏకీభవిస్తూ.. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు.