Kalki 2898 AD movie review
తెలుగు360 రేటింగ్ 3.25/5
థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు కొన్నే ఉంటాయి. ‘ఇలాంటి సినిమాని థియేటర్లోనే చూడాలి..’ అనే ఫీలింగ్ తీసుకొస్తాయి. ఓ ‘బాహుబలి’, ఓ ‘ఆర్.ఆర్.ఆర్’ అలాంటి సినిమాలే. ఇప్పుడు కల్కి. ఈ సినిమాపై ముందు నుంచీ ఎన్నో ఆశలు, అంచనాలూ ఏర్పడ్డాయి. నాగ్ అశ్విన్ ఎత్తుకొన్న పాయింట్, పోస్టర్‌పై కనిపిస్తున్న తారాగణం, పెట్టిన ఖర్చు, చేసిన ప్రమోషన్స్… ఇవన్నీ ‘కల్కి’ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టాయి. ప్రేక్షకుడు కూడా తల పైకెత్తే ఈ సినిమాని చూశాడు. మరి ఆ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? విజువల్ ఫీస్ట్ గా వర్ణించదగిన లక్షణాలు ఇందులో ఏమున్నాయి?
మహాభారత యుద్ధంతో ఈ కథ మొదలవుతుంది. అశ్వద్ధామకు శ్రీకృష్ణుడు శాపం ఇవ్వడం, కలియుగంలో `కల్కి`గా మళ్లీ అవతరిస్తానని, అప్పుడు తనని కాపాడాలని, దాంతో శాపవిమోచన కలుగుతుందని చెప్పడం, ఈ కథ కలియుగానికి షిఫ్ట్ అవ్వడం జరిగిపోతాయి. ప్రపంచమంతా నాశనమైపోయిన తరుణంలో, ఈ భూమ్మీద మిగిలిన చిట్ట చివరి నగరం… కాశీ. అక్కడ కూడా బతుకు దుర్భరంగా ఉంటుంది. ఎక్కడ చూసినా ఇసుకే. మొక్క కూడా మొలవని వాతావరణం. భూమ్మీద ఉన్న సంపద, సౌందర్యమంతా ‘కాంప్లెక్స్’ లాగేసుకొంటుంది. ఎలాగైన సరే… ఆ కాంప్లెక్స్‌లో అడుగు పెట్టాలనుకొంటాడు భైరవ (ప్రభాస్). ఆ కాంప్లెక్స్ అంతా యాస్కిన్ (కమల్ హాసన్) అధీనంలో ఉంటుంది. మరణం లేకుండా ఎప్పటికీ బతికే ఉండాలన్నది తన కోరిక. అందుకే గర్భవతుల సిరమ్‌ని తన శరీరంలోకి ఇంజెక్ట్ చేయించుకొంటుంటాడు. ఆ కాంప్లెక్స్ లో 90 రోజులు కూడా గర్భాన్ని మోసే శక్తి ఏ ఆడపిల్లకూ ఉండదు. అలాంటి గర్భవతి కోసం యాస్కిన్ అన్వేషిస్తుంటాడు. మరి తన కోరిక ఫలించిందా? భైరవ కాంప్లెక్స్‌లో అడుగు పెట్టగలిగాడా? అశ్వద్ధామ శాప విమోచన ఎలా జరిగింది? కల్కి అవతారం ఎప్పుడు, ఎలా సంభవించింది? అనేది మిగిలిన కథ.
పురాణాలను, సైన్స్ తో మిళితం చేసిన ఫిక్షన్ కథ ఇది. నిజానికి ఆ ఆలోచనే మెచ్చదగినది. తొలి 5 నిమిషాల్లో చూపించిన విజువల్స్ తోనే నాగ అశ్విన్ ప్రేక్షకుల్ని అరెస్ట్ చేసేశాడు. ఒక్కసారిగా తన ప్రపంచంలోకి లాక్కెళ్లాడు. మహాభారత సంగ్రామాన్ని చాలా ఎఫెక్టీవ్ గా ఆవిష్కరించగలిగాడు. కలియుగంలో ఫ్రేమ్ పెట్టడంతో ఒక్కసారిగా మూడ్ షిఫ్ట్ అవుతుంది. కలియుగంలో ఈ ప్రపంచం ఎలా ఉంటుందన్నది ఊహ. ఇక్కడ దర్శకుడు ఏమైనా చెప్పొచ్చు. అదంతా తన క్రియేటీవ్ స్పేస్. దాన్ని బాగా వాడుకొన్నాడు. నిజంగానే కలియుగంలో ప్రపంచం ఇలా మారిపోతుందా? అనే భయం ఏర్పడుతుంది ఆ విజువల్స్ చూస్తుంటే. చుక్క నీటి కోసం పరితపించడం, ఓ యాపిల్ విసిరేస్తే.. జనం ఎగబడడం భవిష్యత్తుపై భయాన్ని కలిగిస్తాయి. పర్యావరణాన్ని ఆదమరిస్తే మవుతుందో చూపించేశాడు నాగ అశ్విన్.
కాంప్లెక్స్ లోని ప్రపంచం మరో అద్భుతమైన విజువల్ వండర్. వాహనాలు, సెల్ ఫోన్ లాంటి పరికరాలు, బుజ్జి.. ఇవన్నీ దర్శకుడి సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తాయి. సినిమా మొదలైన 20 నిమిషాల వరకూ ప్రభాస్ ఎంట్రీ ఉండదు. కానీ ఆ 20 నిమిషాలూ కథతో పాటు ప్రేక్షకుడు ప్రయాణం చేస్తాడు తప్ప, ప్రభాస్ రావడం లేదేంటి? అని ఆలోచించడు. ప్రభాస్ ఎంట్రీ సింపుల్ గా ఉన్నా, సరదాగా అనిపిస్తుంది. ప్రభాస్ పాత్రని జోవియల్ గా మార్చడం మంచి ఆలోచన. ఎందుకంటే ఈ సినిమాలో ప్రభాస్ ఒక్కడే నవ్వుతూ.. నవ్విస్తూ కనిపిస్తాడు. తొలి సగంలో ప్రభాస్ అక్కడక్కడ వస్తూ, పోతుంటాడు. ప్రభాస్ అభిమానులకు ఇది ఇబ్బంది కలిగించే విషయమే అయినా, కథా పరిమితుల దృష్ట్యా అది తప్పలేదు. ఇంట్రవెల్ బ్యాంగ్ దగ్గర ప్రభాస్, అమితాబ్, దీపిక పాత్రల్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి, మంచి ఎమోషన్ హై ఇస్తాడు. ఈమధ్యలో కమల్ ఎంట్రీ, అతని గెటప్ ఆశ్చర్య పరుస్తుంది. సినిమా మొత్తానికి కమల్ కనిపించేది రెండే రెండు సందర్భాల్లో. ఒకసారి పూర్తిగా గ్రాఫిక్ మాయలా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో మరోసారి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ మాత్రం నిజమైన కమల్ కనిపిస్తాడు.
ద్వితీయార్థంలో యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చాడు దర్శకుడు. అక్కడ ఎవెంజెర్స్ టైపు పోరాట ఘట్టాలు ఆకట్టుకొంటాయి. ఆయా యాక్షన్ సీన్లు సుదీర్ఘంగా సాగినా, అందులో చూపించిన ఎలిమెంట్స్ ఎట్రాక్టీవ్ గా కనిపించాయి. ముఖ్యంగా ప్రభాస్ – అమితాబ్‌ల మధ్య పోరు ఆకట్టుకొంటుంది. తెరపై అశ్వద్ధామగా అమితాబ్ విధ్వంసం చూసేకొద్దీ చూడబుద్ధేస్తుంటుంది. క్లైమాక్స్ 20 నిమిషాలూ మరో ఎత్తు. అక్కడ మళ్లీ భారత కథని లింకు చేసిన పద్ధతి, సరైన సమయంలో ప్రభాస్ పాత్రని ఎలివేట్ చేసిన విధానం ప్రేక్షకులకు నచ్చుతాయి. పార్ట్ 2లో మరింత విధ్వంసం జరగబోతోందన్న సంకేతాలు ఇచ్చాడు దర్శకుడు.
‘రేపటి కోసం’ అనే డైలాగ్ ఈ సినిమాలో చాలాసార్లు వినిపిస్తుంది. నాగ అశ్విన్ కూడా ‘రెండో భాగం కోసం’ అనుకొని కొన్ని పాత్రల్ని పూర్తిగా ఓపెన్ చేయలేదేమో అనిపిస్తుంది. అందులో కమల్ పాత్ర ఒకటి. ఈ సినిమాలో కమల్ నటిస్తున్నాడు, అందులోనూ ప్రతినాయకుడిగా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. కమల్ గెటప్ కూడా అదిరింది. కానీ ఆ పాత్రని చూపించింది కాసేపే. ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ చాలా ఉన్నాయి. కొన్ని సరదాగా అనిపిస్తాయి. ఇంకొన్ని ‘ఎందుకొచ్చిన గెస్ట్ ఎంట్రీ’ అనిపిస్తాయి. అనుదీప్ కూడా ఈ సినిమాలో కనిపిస్తాడు. రెప్ప మూసి తెరచేలోగా మాయమైపోయే పాత్ర ఇది. ఇలాంటి ఇంపాక్ట్ లేని ఎంట్రీలెందుకు? అనేది పెద్ద ప్రశ్న. రాజమౌళి ఎంట్రీ సరదాగా ఉంటుంది. ‘నీకు దొరికితే ఐదేళ్లు వాయించేస్తావ్’ అనడం కూడా సరదాగా అనిపిస్తుంది. రాజమౌళితో సినిమా అంటే ఐదేళ్లు పడుతుందన్నది ఇక్కడ నాగ అశ్విన్ సెటైర్. అది ప్రభాస్ తో పలికించడం బాగుంది.
ఇది కలియుగంలో సాగే కథ. కలియుగంలో ఎమోషన్స్ అంటూ ఉండవు అని మనం బలంగా నమ్మిన మాట. అయితే అలాంటి యుగంలో కూడా ప్రేమ, పెళ్లి అంటూ మాట్లాడించడం, ‘ఒక్కసారి ఐలవ్ యూ చెప్పు’ అని దిశాపటానీ ప్రభాస్‌ని బతిమాలుకోవడం చూస్తే నాగ అశ్విన్ ఏ కాలంలో సినిమా తీసినా, ఇలాంటి ఎమోషన్స్‌ని వదులుకోలేడా అనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా కమల్ హాసన్ చివర్లో మహాప్రస్థానంలోని పంక్తులు వినిపిస్తుంటాడు. ఆ కాలమేంటి? ఆ పాత్ర ఏమిటి? పలుకుతున్న భావాలేంటి? అనే ప్రశ్న ఉదయిస్తే అది కచ్చితంగా ప్రేక్షకుల తప్పు కాదు. మానవ సంబంధాలే మనుగడకు నోచుకోలేని కాలంలో, సాహిత్యానికి చోటివ్వడం దర్శకుడి తాలుకా సాహిత్యాభిలాషే తప్ప మరోటి కాదు.
ప్రభాస్ తన ఇమేజ్‌తో కొన్ని సన్నివేశాల్ని మోశాడు. ముఖ్యంగా వార్ ఎపిసోడ్స్ లో. చివర్లో ప్రభాస్ పాత్రని పురాణాలకు లింకు పెడుతూ చూపించే సీన్ గూజ్‌బమ్స్ కలిగిస్తుంది. ప్రభాస్ కూడా చాలా జాలీగా ఈ సినిమా చేసుకొంటూ వెళ్లాడు. అమితాబ్ పాత్ర చాలా కీలకం. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఎక్కువే. తెరపై అమితాబ్ ని అంతసేపు చూడడం బాగుంది. దీపికాది బరువైన పాత్ర. కమల్ అతిథి పాత్రకే పరిమితం. బహుశా పార్ట్ 2లో ఆయన్ని బాగా వాడుకొంటారేమో.
ఓ రకంగా ఇప్పటి వరకూ మనం చూడని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సృష్టించాడు నాగ అశ్విన్. తన విజువల్ సెన్స్‌కు పూర్తి మార్కులు పడతాయి. తెరపై ఇంత ఖర్చు పెట్టి, ఇంత భారీగా తీయడం వైజయంతీ మూవీస్‌కే సాధ్యం. మేకింగ్ హాలీవుడ్ స్థాయిలో సాగింది. ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా కుదిరింది. నాగ అశ్విన్‌ది రెండు సినిమాల అనుభవం మాత్రమే. ఇంత పెద్ద స్కేల్ ఉన్న సినిమాని భుజాలపై వేసుకొని నడిపించడం మామూలు విషయం కాదు. మధ్యమధ్యలో సినిమా స్లో ఫేజ్‌లోకి వెళ్లడం, కొన్ని విషయాలు సామన్య ప్రేక్షకులకు అర్థం కాకపోవడం, కాంప్లెక్స్ చుట్టూ సాగిన సన్నివేశాల్లో గందరగోళం ఇవన్నీ కాస్త కలవరపెడతాయి. ఆయా విషయాల్లో నాగ అశ్విన్ జాగ్రత్త పడి ఉంటే – ఇంకా ఇంకా బాగుండేది.
మొత్తానికి ఓటీటీల పేరుతో చిన్న చిన్న తెరపైనే వినోదాలకు సర్దుకుపోతున్న ప్రేక్షకుల్ని మళ్లీ థియేటర్లకు రప్పించేంత విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాగా ‘కల్కి’ మిగిలిపోతుంది. ఇది నిజంగానే ‘రేపటి’ సినిమా. ఎందుకంటే మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ జోడించి, ఫాంటసీ మిక్స్ చేసి, స్టార్ బలాన్ని వాడుకొంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ఇది. ఈ దారిలో మరింతమంది దర్శకులు, నిర్మాతలు నడిచే ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది.
తెలుగు360 రేటింగ్ 3.25/5
-అన్వర్