ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు రవిశంకర్ అద్వర్యంలో నేటి నుండి డిల్లీ సమీపాన యమునా తీరంలో మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలపై చెలరేగిన వివాదం సమసిపోయిందని చెప్పవచ్చును. ఆ ఉత్సవాల నిర్వహణ కోసం పర్యావరణ విద్వంసానికి పాల్పడినందుకు డిల్లీలోని గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయస్థానం దాని నిర్వాహకులయిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థకు రూ.5 కోట్లు జరిమానా విధించింది. “జైలుకయినా వెళతాను గానీ ఒక్క పైసా కూడా చెల్లించదలచుకోలేదని” రవిశంకర్ చెప్పడంతో గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒకవేళ జరిమానా చెల్లించకపోతే చట్టపరంగా చర్యలను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించింది.
అప్పుడు ఆయన సంస్థ ప్రతినిధులు కాళ్ళబేరానికి వచ్చేరు. తమది ఒక స్వచ్చంద సంస్థ అని ఒకే సారి అంత బారీ జరిమానా చెల్లించలేమని కనుక తమకు నెల రోజులు గడువు కావాలాని కోరారు. అందుకు గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయస్థానం అంగీకరించింది కానీ ఈరోజు సాయంత్రంలోగా రూ.25 లక్షలు చెల్లించవలసిందేనని లేకుంటే అది ప్రభుత్వానికి డిపాజిట్ గా చెల్లించిన రూ. 2.5 కోట్లను జప్తు చేస్తామని హెచ్చరించడంతో అందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. అనంతరం మూడు రోజుల పాటు యమునా తీరంలో సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించుకోవడానికి గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయస్థానం అనుమతించింది.