ఏపీలో మేము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీని వేస్తాం… ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్న యువతకు చంద్రబాబు ఇచ్చిన భరోసా. చెప్పినట్లుగానే అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారు.
మూడు సంవత్సరాలుగా ఏపీలో టెట్ పరీక్ష నిర్వహించలేదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు రెండు రకాలుగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుందని, అప్పుడే కోర్టు చిక్కులు ఉండవని విద్యాశాఖ భావిస్తోంది.
ఇప్పటికే టెట్ అర్హత సాధించిన వారికి డీఎస్సీ నోటిఫికేషన్ వేయటంతో పాటు తాజాగా మరో టెట్ పరీక్ష పెడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుందని విద్యాశాఖ తుది నిర్ణయానికి వచ్చింది. గతంలో టెట్ పరీక్షకు అర్హత సాధించినా, కొందరు స్కోరింగ్ కోసం మళ్లీ రాయాలి అనుకున్నా తాజా టెట్ లో రాసుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది.
ఈ రెండు రకాల నోటిఫికేషన్లు ఈ నెల 30న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో, నోటిఫికేషన్లలో ఏయే తేదీల్లో అప్లై చేసుకోవాలి, టెట్ పరీక్షకు సమయం ఇవ్వటంతో పాటు డీఎస్సీ ఎగ్జామ్ కు సమయం ఇస్తూ తేదీలు విడుదల చేయనున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 10కల్లా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలా ప్రణాళికాబద్ధంగా నోటిఫికేషన్ విడుదల కాబోతుంది.