సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కింది మొదలు… కాంగ్రెస్ పార్టీలో, సోషల్ మీడియాలో ఒకటే చర్చ. త్వరలో క్యాబినెట్ విస్తరణ అని. కొందరు నేతలైతే తేదీలు కూడా ప్రకటించేశారు. కొందరు నేతల అనుచరులు గుడిలో మొక్కులు చెల్లించగా, నాకు మంత్రి పదవి వచ్చేస్తుందని ప్రచారం చేసుకున్న నేతలు కూడా ఉన్నారు.
కానీ, ఆ నేతల ఆశలపై ఒక్క మాటతో సీఎం రేవంత్ నీళ్లు చల్లారు. తమ ఢిల్లీ పర్యటనలో అసలు క్యాబినెట్ విస్తరణ అంశమే చర్చకు రాలేదని కుండబద్ధలు కొట్టేశారు. అంతేకాదు ఇప్పుడు ఏ శాఖ కూడా ఖాళీగా లేదని స్పష్టం చేశారు. అదిలాబాద్, నిజామాబాద్ సహా ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేని ప్రాంతాల నేతలు మంత్రి పదవులు దక్కుతాయని ఆశపడ్డారు. కొందరు సామాజిక వర్గాల వారీగా తమకు అవకాశం వస్తుందని ఎదురుచూశారు.
గతంలో సీఎంగా కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేశారని, ఒక్క మంత్రిని కూడా తీసుకోలేదని… ఇప్పుడు వారు విమర్శలు చేయటం ఎంటి అని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని శాఖల్లో యాధావిధిగా పనులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు.
ఈసారి ఢిల్లీ పర్యటనకు అందరు మంత్రులను కూడా తీసుకొని వచ్చామని… త్వరలో కేంద్రబడ్జెట్ పెట్టబోతున్న నేపథ్యంలో మంత్రులను కలిశామని, ప్రధాని మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షాతో కూడా భేటీ అవుతామని సీఎం రేవంత్ ప్రకటించారు.
కొందరు మా పార్టీలో ఏదైనా జరిగితే వాడుకోవాలని నక్కల్లా వెయిట్ చేస్తున్నారని కానీ జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేతలకు హైకమాండ్ భరోసా ఇచ్చిందన్నారు. అసలు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్ కు లేదన్నారు. ఫిరాయింపులకు పునాదులు వేసిందే కేసీఆర్ కదా… తప్పైందని అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాస్తారా అని రేవంత్ ప్రశ్నించారు.