హోస్ఫుల్ బోర్డులు..
‘అన్నా ఒక టికెట్ ఉంటే చూడవా’ అని రిక్వెస్టులు..
‘బ్లాక్ లో అయినా సరే..’ అనే తెగింపులు..
– ఇవన్నీ చూసి, ఈ మాటలు విని… ఎంత కాలమైందో..? ఈ సంక్రాంతికి అనుకొన్నంత జోష్ రాలేదు. వేసవి హుష్ కాకి అయ్యింది. ఐపీఎల్ ఓవైపు, రాజకీయాలు ఒకవైపు.. వెరసి టాలీవుడ్ మిషన్ లో ఇరుక్కొన్న చెరకు గడ అయ్యింది. ఓటీటీలు పెరిగాయి. జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. బుల్లి తెర వినోదాలతో సర్దుకుపోతున్నారు. ఇలాంటి దశలో మళ్లీ ఓ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కావాలి. థియేటర్లు దద్దరిల్లాలి, రికార్డులు మోతెత్తిపోవాలి.. అనుకొంటున్న దశలో ‘కల్కి’ వచ్చింది. ఆ ముచ్చట తీర్చింది.
మూడు రోజుల నుంచీ టాలీవుడ్ ని ‘కల్కి’ ఫీవర్ ఊపేస్తోంది. ఎక్కడ చూసినా ఇదే మాట. ఈరోజు ‘కల్కి’ విడుదలైంది. అసలు ఓ స్టార్ హీరో సినిమాకున్న స్టామినా ఏమిటో మరోసారి జనాలకు అర్థమైంది. ఎక్కడ చూసినా జనం. ఉదయం 4 గంటల నుంచే.. థియేటర్ల ముందు పడిగాపులు, టాక్ ఏమిటా? అనే ఆత్రుత. థియేటర్ ముందు పండగ వాతావరణం. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేదు, సినిమాని ఇష్టపడేవాళ్లంతా ‘కల్కి’ గురించి మాట్లాడుకొంటున్నారు. ట్విట్టర్లో కల్కి టాక్ ట్రెండింగ్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘కల్కి’ నామ స్మరణే. ఇలాంటి సీన్ చూసి చాలా కాలం అయ్యింది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ వచ్చినా ఇంత కిక్ లేదన్నది వాస్తవం. మళ్లీ ‘కల్కి’తో.. టాలీవుడ్ రేంజ్, బాలీవుడ్ కి, ఇండియన్ సినిమాకీ మరోసారి తెలిసొచ్చింది. తొలిరోజు పాత రికార్డులకు పాతర పెట్టింది ‘కల్కి’. ఈ జోరు వారాంతం అంతా కనిపించడం ఖాయం. నార్త్ లో ఈ సినిమా ఎంత గట్టిగా నిలబడుతుంది? ఎన్ని రోజులు తన జోరు కొనసాగుతుంది? అనేదాన్ని బట్టి `కల్కి` రేంజ్ ఆధారపడి ఉంటుంది.
కాకపోతే ఒకటి మాత్రం నిజం. తీస్తే పెద్ద సినిమా తీయాలి, విజువల్స్ రేంజ్ ఇలా ఉండాలి అనే కసి.. ‘కల్కి’తో మరింత పెరిగింది. స్టార్ హీరోల కెపాసిటీ ఏమిటో బాక్సాఫీసుకు మరోసారి అర్థమైంది. ఈ విషయంలో ‘కల్కి’కీ, దర్శకుడు నాగ్ అశ్విన్కీ, నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్కీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. యేడాదికి కనీసం రెండు మూడుసార్లయినా ఇలాంటి సినిమాలు వస్తుంటే థియేటర్లకు జనాలు రారేమో అనే బెంగ ఇక ఎప్పటికీ ఉండదు.