తెలుగు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేసిన రామోజీరావుకు సముచితమైన గుర్తింపు ఇచ్చేందుకు చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విజయవాడలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో చంద్రబాబు కీలక ప్రకటనలు చేశారు. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ మాదిరిగా అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అమరావతిలో ఓ రోడ్డుకు రామోజీరావు పేరు పెడతామన్నారు.ఈనాడు పత్రికను విశాఖ నుంచి ప్రారంభినందున అక్కడ రామోజీ చిత్రనగరి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. నవ్యాంధ్ర రాజధానికి అమరావతి అని పేరు పెట్టింది రామోజీరావేనని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
పవన్ కల్యాణ్ కూడా రామోజీ విగ్రహం అమరావతిలో పెట్టాలని తన ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. సినిమాలు చేస్తున్న సమయంలో రామోజీని కలిసేందుకు పెద్దగా అవకాశం రాలేదని కానీ 2019 ఎన్నికల సమయంలో తనను లంచ్ మీటింగ్ కు ఆహ్వానించారని గుర్తు చేసుకున్నారు. తాను ఏం చేయాలనుకున్నా త్రికరణ శుద్ధిగాచేయాలని సలహాలు ఇచ్చారన్నారు. ఏపీకి మంచిరోజులు వస్తున్నాయన్న విషయం తెలుసుకున్న తరవాతనే ఆయన కన్నుమూశారని అన్నారు. ఆయనది సంపూర్ణమైన జీవితమన్నారు.
ఈ సంస్మరణ సభకు రామోజీ కుటుంబసభ్యులంతా హాజరయ్యారు. అమరావతికి కుటుంబం తరపున రూ. పది కోట్ల విరాళాన్ని ప్రకటించారు రామోజీ తనయుడు కిరణ్. సభ అవగానే వేదిక మీద ఆ రూ. పది కోట్ల చెక్కును సీఎంకు అందించారు. సభకు ఇంగ్లి, హిందీ దిగ్గజ పత్రికలు అయిన హిందూ, రాజస్థాన్ పత్రిక చీఫ్ ఎడిటర్లను ఆహ్వానించారు. రాజకీయ నేతలు.. సినీ ప్రముఖులు హాజరై రామోజీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాజమౌళి రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు.