కర్ణాటక ప్రభుత్వం తీసుకొన్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆ రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారింది. నటి తమన్నా జీవిత కథని సిలబస్‌లో చేర్చడమే అసలు మేటరు. ఇక కొత్త పుస్తకాల్లో తమన్నా కథని బెంగళూరు బాల బాలికలు పాఠాలుగా చదువుకోవాల్సిందే. ఈ నిర్ణయం వివాదాస్మదమైంది. తమన్నా ఏం సాధించిందని, ఆమె కథని పిల్లలు పాఠాలుగా నేర్చుకోవాలి? అని అక్కడి విద్యావేత్తలు మండి పడుతున్నారు. తమన్నాకి బదులుగా దేశం కోసం పోరాడిన వీరుల కథల్ని పిల్లలకు చెప్పండి అంటూ హితబోధ చేస్తున్నారు.
తమన్నాది కర్ణాటక కూడా కాదు. ఆమెది ముంబై. పైగా తమన్నా ఓ గ్లామరస్ స్టార్ అంతే. ఆమె ప్రజలకు చేసిన సేవ కూడా ఏం లేదు. మహాద్భుతమైన పాత్రలు పోషించిందా అంటే అదీ లేదు. అలాంటప్పుడు తమన్నా గురించి బాలబాలికలు ఎందుకు తెలుసుకోవాలి? అనేదే ప్రశ్న. సెలబ్రెటీల జీవితాలు పాఠాలుగా బోధిస్తే.. పిల్లలకు ఆసక్తి కలుగుతుందని, కొత్త విషయాలు మరిన్ని నేర్చుకోవాలన్న కుతూహలం పెరుగుతుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోందట. అయితే… ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే… సోషల్ మీడియా నిండా ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్నట్టు తమన్నా తో పాటు రణవీర్ సింగ్ కథని కూడా పాఠంగా చెప్పాలన్న ఆలోచనలో ఉంది అక్కడి ప్రభుత్వం. మరి వీటిపై ప్రభుత్వ పెద్దలు మొండిగా ముందుకు వెళ్తారో, ఒక్కసారి సమీక్షించుకొని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటారో చూడాలి.