పవన్ కల్యాణ్‌పై గత ఐదేళ్లలో అనుచితమైన దాడి చేసిన వారిలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. పిఠాపురంలో పవన్ ను ఓడించడానికి చాలా ఖర్చు పెట్టారు. ముద్రగడను తెరపైకి తెచ్చారు. ఇప్పుడు పవన్ వంతు వచ్చింది. ఆయన గుట్టుముట్లన్ని తెలిసిన జనసేన పార్టీ .. మెల్లగా చుుట్టూ కమ్మేయడం ప్రారంభించింది.
ద్వారంపూడి ప్రధాన దందా బియ్యం స్మగ్లింగ్. గత ఐదేళ్ల కాలంలో కాకినాడ పోర్టు నుంచి ఆయన ఎంత బియ్యం స్మగ్లింగ్ చేశారో చెప్పడం కష్టం. బియ్యానికి సంబంధించి ప్రతి అంశం రాష్ట్రంలో ద్వారంపూడి గుప్పిట్లోనే ఉంటుంది. రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడిగా ఆయన తండ్రే ఉంటారు. ఇప్పుడు ఆ వ్యవహారాలన్నీ బయటకు తీస్తున్నారు. పౌరసరఫరాల శాఖా మంత్రిగా నాదెండ్ల బాధ్యతలు చేపట్టిన వెంటనే బియ్యం అక్రమరవాణాపై దృష్టి సారించారు. మొత్తం వివరాలు బయటకు లాగారు. తాజాగా కాకినాడ పోర్టులోఉన్న బియ్యం గౌడౌన్లను సీజ్ చేయించారు.
కాకినాడ పోర్టును ఒక అడ్డగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా మార్చేశారన్నారు. చిత్తూరు నుండి కాకినాడ వరుకు వ్యవస్థీకృత మోసాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చేశారన్నారు. ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఆవేశంగా నిర్ణయాలు తీసుకోవడం కాకుండా తప్పు చేసిన వారిని ఖచ్చితంగా సాక్ష్యలతో సహా పట్టుకునేలా కూటమి మంత్రులు అడుగులు వేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు.